మేఘాలను చూస్తూ వీడియోలు తీస్తూ నెలకు రూ.8 లక్షలు సంపాదన.. 23 ఏళ్ల కుర్రోడి క్రేజీ జాబ్ లైఫ్

మేఘాలను చూస్తూ వీడియోలు తీస్తూ నెలకు రూ.8 లక్షలు సంపాదన.. 23 ఏళ్ల కుర్రోడి క్రేజీ జాబ్ లైఫ్

నగరాల్లోని ట్రాఫిక్, బిజీలైఫ్.. ఆఫీసు ఒత్తిడిని వదిలేసి ప్రశాంతమైన పర్వతాల మీద కూర్చుని పని చేయాలని ఎవరికి ఉండదు? కానీ ఆ కల నిజమై ఏకంగా నెలకు రూ.8 లక్షల 50వేలు జీతం వస్తే? అవునండి చైనాకు చెందిన 23 ఏళ్ల లీ సిచెన్ అనే కుర్రోడు ఇప్పుడు ఈ 'డ్రీమ్ జాబ్'తో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారాడు. చైనాలోని హేనాన్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రసిద్ధ లాజున్ పర్వత ప్రాంతం ప్రకటించిన 'క్లౌడ్ స్కేప్ అబ్జర్వర్' ఉద్యోగానికి అతను ఎంపికయ్యాడు.

ఈ విచిత్రమైన ఉద్యోగం కోసం 3వేల 500 మందికి పైగా పోటీ పడగా.. లీ సిచెన్ తన క్రియేటివిటీతో విజేతగా నిలిచాడు. జూలై 16 నుండి ఆగస్టు 15 వరకు.. అంటే సరిగ్గా 30 రోజుల పాటు మేఘాలను, పర్వత అందాలను తన కెమెరాలో బంధించి, ప్రతిరోజూ సోషల్ మీడియాలో వీడియోలు పంచుకోవడమే అతని పని. దీనికి ప్రతిఫలంగా అతనికి రూ. 8లక్షల 50వేల పారితోషికంతో పాటు అక్కడే ఉండేందుకు సదుపాయం కూడా కల్పించారు.

ఇది చూడటానికి చాలా ప్రశాంతంగా అనిపించినా.. లీ సిచెన్ పని మాత్రం ఉదయం 5 గంటలకే మొదలయ్యేది. సూర్యోదయానికి ముందే షూటింగ్ మొదలుపెట్టి, సూర్యాస్తమయం అయ్యే వరకు వివిధ కోణాల్లో మేఘాలను, పర్వతాల అందాలను వీడియో తీయడం మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు. ఈ క్రమంలో డ్రోన్ ఆపరేటింగ్, కలర్ గ్రేడింగ్, వీడియో ఎడిటింగ్ వంటి కొత్త నైపుణ్యాలను ఈ నెల రోజుల్లో అతను సొంతం చేసుకున్నాడు.

అయితే ఈ ఉద్యోగంలో సవాళ్లు కూడా ఉన్నాయి. వాతావరణం అనుకూలించని రోజుల్లో షూటింగ్ చేయడం అతనికి ఒక 'టార్చర్'లా అనిపించేది. ప్రకృతిని మనం నియంత్రించలేం కాబట్టి.. ఆశించిన ఫుటేజ్ రానప్పుడు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడట. అయినా సరే.. వెనకడుగు వేయకుండా తన బాధ్యతను పూర్తి చేశాడు. లాజున్ పర్వత ప్రాంతానికి మూడో కన్నులా కొత్త కోణంలో ప్రకృతిని చూపించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.

లౌజున్ పర్వతం 2వేల ఏళ్ల చరిత్ర కలిగిన తావోయిస్ట్ పర్వతం. చైనాలో అత్యున్నత స్థాయి పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన ఈ చోట.. ఈ కొత్త రకమైన జాబ్ పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా, యువతకు కొత్త అవకాశాలను పరిచయం చేసింది. నెలకు లక్షల్లో సంపాదిస్తూ.. మేఘాలతో కాలం గడిపిన లీ సిచెన్ ప్రయాణం చూస్తుంటే ప్యాషన్ ఉంటే ఇలాంటి అద్భుతమైన కెరీర్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనిపిస్తోంది అంటున్నారు నెటిజన్లు.