తలనొప్పి, నడుము నొప్పి.. ఇలా ఒంట్లో ఏ నొప్పులు ఉన్నా వెంటనే గుర్తొచ్చేది పెయిన్ కిల్లర్. మెడికల్ షాప్లో ఈజీగా, తక్కువ ధరకు దొరికే ఈ నొప్పి నివారణ మాత్రలు వేసుకోగానే నిమిషాల్లో రిలీఫ్ ఇస్తాయి. అందుకే నొప్పులతో బాధపడేవారు ఒక దశలో వీటికి అలవాటు పడిపోతారు. కానీ, కొంతకాలం తర్వాత ఆ మాత్రలు వేసుకున్నా నొప్పులు తగ్గట్లేదని డాక్టర్ దగ్గరకు వెళ్తారు. అప్పుడు తెలుస్తుంది అసలు సమస్య! మరి పెయిన్ కిల్లర్స్ మంచివా? కాదా?
పెయిన్ కిల్లర్ వేసుకోగానే చాలా ఫాస్ట్‌గా రిలీఫ్ వస్తుంది. అందుకే చాలామంది రెగ్యులర్‌గా వాడుతుంటారు. కానీ.. అలా వాడితే గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ పెరుగుతుంది. వీటిని ఏడాదికో, నెలకో ఒకటి రెండు సార్లు వాడితే పర్లేదు. అంతకుమించి వాడితే కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కిడ్నీల మీద ప్రభావం చూపిస్తాయి. ఈ విషయాలన్నీ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడేవాళ్లకు తెలిసినవే. కానీ, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
ట్రమడాల్కు అడిక్ట్ అవ్వొద్దు
గతేడాది అక్టోబర్‌లో ‘బిఎమ్‌జె ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్’ పబ్లిష్ చేసిన జర్నల్ ప్రకారం దీర్ఘకాలిక నొప్పులను నివారించేందుకు ట్రమడాల్ ట్యాబ్లెట్ పెద్దగా ప్రభావం చూపించట్లేదు. రీసెర్చర్లు సుమారు 6,500 మందిపై19 రకాల క్లినికల్ ట్రయల్స్ డేటాను పరిశీలిస్తే ఈ మందు మంచికన్నా చెడు ఎక్కువగా చేస్తుందని గుర్తించారు. మామూలుగానే ఈ తరహా పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు మలబద్ధకం, మగతగా అనిపించడంతోపాటు కొంతమందికి వాంతులు కూడా అవుతాయి. ఈ టాబ్లెట్స్ వాడితే అలవాటు పడే చాన్స్ కూడా ఉంది.
అయితే లేటెస్ట్ రీసెర్చ్లో ట్రమడాల్వాడడం వల్ల చాతీ నొప్పి, కరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్ వంటివి జరిగే ప్రమాదం ఉందని తేలింది. ట్రమడాల్ అనేది ఒపియాయిడ్ అనే మత్తు మందు రకానికి చెందినది. కాబట్టి మెదడుకు సంకేతాలు అందకుండా మందగించేలా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరు కోట్ల మంది ఈ డ్రగ్‌కు బానిస అయినట్లు అంచనా. అందుకని దీని వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని ఎక్స్పర్ట్స్ చెప్పారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తోనే వాడాలి.
కామన్ రీజన్స్
పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల క్రియాటిన్ పెరిగి కాళ్లు, మొహంలో వాపు కనిపిస్తుంది. కాబట్టి ముందు నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. ఉదాహరణకు కాల్షియం, విటమిన్–డి వంటివి తక్కువైతే ఒళ్లు నొప్పులు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరిగినా పెయిన్స్ వస్తాయి. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. అందుకని నొప్పులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుని వాడితే తిరిగి రాకుండా ఉంటాయి. తలనొప్పి, నడుము నొప్పి అంటూ ప్రతిదానికీ పెయిన్ కిల్లర్స్ వాడొద్దు.
పీరియడ్ టైంలో వచ్చే నొప్పికి కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. ఎందుకంటే నొప్పికి రకరకాల కారణాలు ఉండొచ్చు అంటున్నారు గైనకాలజిస్ట్లు. ఏ టాబ్లెట్ అయినా డాక్టర్ చెప్పిన టైం వరకే వాడాలి. ఆ తర్వాత కంటిన్యూ చేయకూడదు. మళ్లీ డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలి. అంతేకానీ, మెడికల్ షాప్లో దొరుకుతున్నాయని వాడితే టాబ్లెట్స్‌కి అలవాటుపడిపోతారు. దీంతో సమస్య తగ్గకపోగా పెద్దదవుతుంది.
పారాసిటమాల్ పర్లేదు!
అన్నింటికన్నా ఎక్కువగా వాడేది పారాసిటమాల్. ఇది సాధారణంగా జ్వరానికి వాడతారు. కానీ, ఇది కొన్ని రకాల నొప్పుల నుంచి రిలీఫ్ ఇస్తుంది. కాబట్టి కొంతమంది వీటిని నొప్పులకు కూడా వాడుతుంటారు. అయితే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. అందుకని పెయిన్ కిల్లర్ వాడాలనుకుంటే ఇది బెటర్. అలాగని రోజూ వాడకూడదు.
నొప్పి ఎందుకు వస్తుంది ?
ఆర్థోపెడిక్ సమస్యలకు పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుందని ఆర్థోపెడీషన్లు చెప్తున్నారు. దాంతోపాటు ఈ పెయిన్ కిల్లర్స్‌ని లాంగ్ టర్మ్‌లో వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా అంటున్నారు. అయితే అసలు నొప్పులు ఎందుకొస్తాయనేది ఇలా వివరించారు. సాధారణంగా ఏదైనా గాయమైనప్పుడు నొప్పి వస్తుంది. అక్కడ రిపేర్ జరగాల్సిన అవసరం ఉందని బ్రెయిన్‌కి సిగ్నల్ వెళ్తుంది. దీంతో గాయం తగ్గడానికి బాడీలో రియాక్షన్స్ జరుగుతాయి. అయితే, బాడీలో ఇన్ఫ్లమేషన్ (వాపు) వల్ల నొప్పి వస్తుంది. ఎలాగంటే.. ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల రియాక్షన్ జరిగి నొప్పి వస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే క్రానిక్ పెయిన్‌కి కారణమవుతుంది.
నిజానికి ప్రోస్టాగ్లాండిన్స్ బాడీలో స్టమక్, ఇంటస్టైనల్ లైనింగ్లా ఉండే మ్యూకోసాను పొట్టలో విడుదలయ్యే యాసిడ్స్ నుంచి రక్షిస్తుంటాయి. అలాగే దెబ్బ తగిలినప్పుడు వెంటనే రక్తం గడ్డకట్టడానికి ప్రోస్టాగ్లాండిన్స్ ఉపయోగపడతాయి. ఇవి సైక్లోఆక్సిజనేస్ అనే ఎంజైమ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అయితే వీటిలో రెండు రకాలున్నాయి. మొదటిరకం బాడీకి మేలు చేస్తుంది. సైక్లోఆక్సిజనేజ్ –2 నుంచి విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పెయిన్ కిల్లర్స్ సైక్లోఆక్సిజనేజ్1, 2 ఎంజైమ్స్ రెండింటి మీద ప్రభావం చూపిస్తాయి. దాంతో ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దీంతో వాపు తగ్గిపోతుంది.
అయితే, రెగ్యులర్‌గా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల పొట్ట, పేగుల్లో ఉండే మ్యూకోసా పొర మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మొదటి రకం ఎంజైమ్ రకాన్ని ప్రభావితం చేయడం వల్ల అల్సర్లు, ఎసిడిటీ వంటివాటితోపాటు పేగుల్లో బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉంది. రక్తం పలచగా అవుతుంది. గాయమైతే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అరికట్టడానికి సైక్లోఆక్సిజనేజ్ –2 ఇన్హిబిటర్స్ అనే టాబ్లెట్స్‌ను సైంటిస్ట్‌లు కనిపెట్టారు. వీటిని వాడాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. ఎందుకంటే గుండె, కిడ్నీ, లివర్, అలెర్జీ సమస్యలు ఉన్నవాళ్లు వాడకూడదు. చిన్నపిల్లలు వీటికి దూరంగా ఉండాలి.
