ఘట్కేసర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కట్టిన వాటర్ ట్యాంకులకు మిషన్ భగీరథ రంగులు వేసి ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ ఆరోపించారు.
పోచారం అన్నోజిగూడ ఎన్టీపీసీ చౌరస్తాలో మున్సిపాలిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం గొంతు తడవని కృష్ణా నీళ్ల నిరసన దీక్ష చేపట్టారు. వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ఇంటింటికీ తాగునీరు ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ నేటికీ ఒక్క గ్రామంలోనైనా పూర్తిస్థాయిలో కృష్ణా నీళ్లు అందించారా..? అని ప్రశ్నించారు.
నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీక్షలో మేడ్చల్ జిల్లా కో – ఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, బి. బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేశ్ గౌడ్, మండల అధ్యక్షుడు కర్రె రాజేశ్, నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్ పాల్గొన్నారు.
