
India Pakistan: భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాక్ ఆర్మీని ఏ స్థాయిలో వణికించిందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పాక్ పై 25 నిమిషాల పాటు మిసైళ్లతో భారత ఆర్మీ దాడిచేసిన సమయంలో జరిగిన ఒక అంశాన్ని అధికారులు వెల్లడించారు. మే 7న దాడి సమయంలో పాక్ ఆర్మీ కమ్యూనికేషన్స్ ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఆర్మీ కమాండర్ తన సైనికులకు చెప్పిన విషయం బయటకు వచ్చింది.
పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్ లోని ముజఫరాబాద్ దగ్గర భారత్ దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన 75వ ఇన్ఫ్యాంట్రీ బ్రిగేడ్ తమ సైనికులను ముందుగా ప్రాణాలను కాపాడుకోవాలని సూచించింది. ఆర్మీ స్థావరాల్లోని మెషినరీ, ఇతర వస్తువులను రక్షించటం కంటే ముందు ప్రాణాలు నిలబెట్టుకోవాలని సూచించింది. ఆ సమయంలో సదరు ఆర్మీ కమాండర్ దగ్గరలోని ఒక మసీదులో తలదాచుకుని.. తన సైనికులను కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించమని చెబుతున్న ఆదేశాలను భారత ఆర్మీ వర్గాలు ఇంటర్సెప్ట్ చేసినప్పుడు వినిపించింది.
ఇక్కడ భారత్ దండెత్తిన సమయంలో సదరు ఆర్మీ కమాండర్ భయంతో మసీదులో దాక్కోవటమే కాకుండా తన సైనికులకు సైతం ప్రాణాలు కాపాడుకోండంటూ భయపడటం పాక్ ఆర్మీ పిరికిపందలని తేల్చేసింది. ప్రాణాలు కాపాడుకుంటే ఆఫీసులను తర్వాత తెరచుకోవచ్చని చెప్పటం భారత ఆర్మీ ముందు పాక్ సైన్యం నిలవలేదని నిరూపిస్తోంది. భారత్ తన ఆపరేషన్ సిందూర్ సమయంలో కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది. ఈ క్రమంలో దాదాపు 100 మంది ఉగ్రమూకలు ప్రాణాలను కోల్పోయి ఉంటాయని తెలుస్తోంది.
అలాగే పాక్ ఆర్మీ చేసిన కాల్పులకు ధీటుగా బదులిచ్చిన భారత్ మూడు రెట్లు ప్రతిదాడిని చేపట్టిందని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో మిలిటరీ స్థావరాలు, మందుగుండు గోదాములు, ఇంధన గోదాములు, ఎయిర్ బేసులు, ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ కి భారీగా నష్టం జరిగినట్లు తేలింది. అయితే నాలుగు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో కాల్పుల విరమణకు జరిగిన అంగీకారంతో ఇవి ఆగాయి. పాక్ ఆర్మీ చేసిన డ్రోన్ దాడులు, మిస్సైల్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. భారత్ వాడిన రక్షణ వ్యవస్థలు, సమన్వయంతో చేపట్టిన దాడులు దీనికి కారణంగా వెల్లడైంది.