ఇదేం విడ్డూరం.. ఓడిపోయిన యుద్ధానికి 488 మెడల్స్ పంచిన పాకిస్థాన్..!!

ఇదేం విడ్డూరం.. ఓడిపోయిన యుద్ధానికి 488 మెడల్స్ పంచిన పాకిస్థాన్..!!

ఈఏడాది భారతదేశంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దానికి కారణమైన పాకిస్థాన్ పై ఆపరేషన్ సిందూర్ పేరుతో దండెత్తిన సంగతి తెలిసిందే. యుద్ధంలో నాలుగు రోజులు కూడా నిలబడలేకపోయిన పాక్ కాల్పుల విరమణను కోరటంతో భారత్ కూడా దానిని అంగీకరించింది. కానీ ఈ మూడు రోజుల్లోనే భారత త్రివిధ దళాలు పాకిస్థాన్ కి చుక్కలు చూపించాయి. వాటి కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, హ్యాంగర్లు, ఎయిర్ బేసులపై బాంబుల మోతపోగించి పాక్ మోకరిల్లేలా చేసింది. ఇంత జరిగినా పాక్ యుద్ధంలో ఓడిపోయాను అనే విషయాన్ని మరచిపోయి ప్రపంచాన్ని కూడా ఏమార్చాలని ప్రయత్నించటమే ఆ దేశాన్ని నవ్వుల పాలు చేస్తోంది. 

ఆగస్టు 14న 79వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న పాకిస్థాన్ ప్రపంచాన్ని ఏమార్చే ప్రయత్నం చేసింది. దేశానికి సంబంధించిన కార్యక్రమంలో అబద్ధాల ప్రచారాన్ని చేపట్టడం అందరూ చీకొట్టేలా చేస్తోంది. ఇస్లామాబాదులో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్థారీతో పాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్ మిలిటరీ అధికారులకు మెడల్స్ ఇచ్చి సత్కరించారు. అయితే ఇవి దేనికో తెలిస్తే మీరు నవ్వుకుంటారు. మే నెలలో భారతదేశంతో జరిగిన యుద్ధంలో ఓడిన పాక్ అందులో వీరత్వం చూపిన తమ సైనికులకు మెడల్స్ ఇచ్చి సత్కరించింది. 

►ALSO READ | దేశ విభజనకు కారణం ఆ మూడు శక్తులే.. రాజకీయ దుమారం రేపుతున్న NCERT సిలబస్ !

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎస్ 400కి ఏమీ కాలేదని ఏకంగా ప్రధాని మోడీ దాని ముందు నిల్చొని సమావేశం నిర్వహిస్తే.. పాక్ మాత్రం దానిని ధ్వంసం చేశాడంటూ వింగ్ కమాండర్ మాలిక్ రిజ్వాన్ అనే వ్యక్తికి మెడల్ ఇచ్చి సత్కరించటమే. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావటంతో పాక్ ప్రధాని ఇచ్చిన ఫేక్ మెడల్ పై పిచ్చ ట్రోలింగ్ జరుగుతోంది. పాక్ తమ దేశంలో ప్రజల వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఎస్ 400 నాశనం చేశామంటూ ప్రచారం చేసుకోవటాన్ని అప్పట్లోనే భారత వర్గాలు ఖండించాయి.

మార్చి నెలలో జరిగిన గొడవ సమయంలో పాక్ అధికారులు పంజాబ్ లోని అదంబార్ ఎయిర్ బేస్ లోని ఎస్ 400 తాము ధ్వంసం చేయగలిగాం అంటూ ఒక శాటిలైట్ చిత్రాన్ని సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేశారు. అది అబద్దం అని నిరూపించటానికి ప్రధాని మోడీ నేరుగా అక్కడికి వెళ్లి సైనికులతో కలిసి ఎస్ 400 సేవల్లో ఉండటాన్ని చూపించారు. అలాగే ఎయిర్ బేసుకు ఎలాంటి నష్టం జరగలేదని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రకటించటంతో పాటు అప్పటి చిత్రాలను కూడా ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. 

 

ఈసారి పైత్యం తలకెక్కిన పాకిస్థాన్ ఓడిపోయిన యుద్ధానికి స్వాతంత్ర్య దినోత్సవంత సందర్భంగా మెడల్ పంచింది. ఒకరికి ఇద్దరికి కాదు ఏకంగా పాక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోన్స్ లోని 488 మందికి చాక్లెట్లు పంచిపెట్టినట్లు మెడల్స్ పంచింది అక్కడి ప్రభుత్వం. యుద్ధంలో ఉన్నవారి నుంచి అబద్ధాలను ప్రచారం చేసిన వారి వరకూ అందరినీ సత్కరించుకుంది పాక్. ఇక పాక్ ఆర్మీ చీఫ్ సితారా ఐ బసలాట్ ఇచ్చింది. ఇక రాజకీయ నాయకులు మంత్రులకు కూడా గౌరవం దక్కింది. పాక్ ఓటమిని గెలుపుగా అభివర్ణిస్తూ ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికీ ఏదోఒకటి ఇచ్చి సత్కరించింది పాకిస్థాన్ ప్రభుత్వం. కానీ ఇదంతా చూసి పాకిస్థాన్ లోని ప్రజలు కూడా నవ్వుకుని ఉంటారు తమ ప్రభుత్వం చేస్తున్న తింగర పనులను చూసి అని నెట్టింట చెప్పుకుంటున్నారు.