ఢిల్లీలో దాడులకు టెర్రరిస్ట్​ల ప్లాన్.. హై అలర్ట్

ఢిల్లీలో దాడులకు టెర్రరిస్ట్​ల ప్లాన్.. హై అలర్ట్
  • ఎల్ఈటీ, జేఈఎం కుట్ర.. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
  • అలర్ట్ అయిన అధికారులు
  • సిటీ అంతటా సెక్యూరిటీ బలగాల మోహరింపు

న్యూఢిల్లీ: పంద్రాగస్ట్ వేడుకల సందర్భంగా ఢిల్లీలో టెర్రర్​ దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు, కేంద్ర సెక్యూరిటీ బలగాలు అలర్ట్ అయ్యాయి. 
పాకిస్తాన్​కు చెందిన లష్కరే తాయిబా(ఎల్ఈటీ), జైషే మహ్మద్(జేఈఎం) ఆగస్ట్ 15న ఢిల్లీలోని భద్రతా సంస్థలు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాలపై దాడులకు ప్లాన్ చేస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. టెర్రరిస్ట్ గ్రూప్​లు ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను టార్గెట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సమాచారం అందిందని తెలిపాయి. ప్రముఖ హైవేలు, రైల్వే స్టేషన్లు, పోలీస్ హెడ్​క్వార్టర్లు, ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం వంటి స్పాట్​లను టార్గెట్ చేయాలని ఎల్ఈటీ ప్లాన్ చేస్తోందని, ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాలపై దాడులు చేసేందుకు జైషే మహ్మద్ కుట్రలు పన్నుతోందని పేర్కొన్నాయి. వీటితో పాటు దేశంలో దాక్కున్న మిలిటెంట్లు, ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటు గ్రూపుల నుంచి కూడా లా అండ్ ఆర్డర్​కు ఆటంకం కలగొచ్చని చెప్పాయి. 

10 వేల మంది పోలీసులతో సెక్యూరిటీ 

ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు నగరంలో పెట్రోలింగ్ పెంచారు. ఢిల్లీలోకి ఎంటర్ అయ్యే అన్ని హైవేలపై వెహికల్స్ తనిఖీలు చేపట్టారు. సిటీ అంతటా భద్రతా బలగాలు మోహరించాయి. అనుమానాస్పద, రద్దీ ప్రాంతాల్లో 10 వేల మంది పోలీసులతో నిఘా ఉంచారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో 1,000 ఫేస్ రికగ్నిషన్  కెమెరాలు, యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. కాగా, 15న ఉదయం జెండా ఎగురవేసిన తర్వాత ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వేడుకలకు దేశ నలుమూలల నుంచి 1,800 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు.