సీజ్ ఫైర్ ఉల్లంఘించిన పాక్.. జమ్మూ కాశ్మీర్‌లో LOC వెంబడి కాల్పులు

సీజ్ ఫైర్ ఉల్లంఘించిన పాక్.. జమ్మూ కాశ్మీర్‌లో LOC వెంబడి కాల్పులు

శ్రీనగర్: దాయాది పాకిస్తాన్ దేశం మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జమ్మూ కాశ్మీర్‌‎లో మరోసారి కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. మంగళవారం (ఆగస్ట్ 5) రాత్రి పూంచ్ సెక్టార్‎లోని ఎల్‌ఓసీ వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ సైన్యం షెల్లింగ్ మొదలుపెట్టడంతో భారత ఆర్మీ వెంటనే అప్రమత్తమైంది. పాక్ ఆర్మీ కాల్పులను ధీటుగా తిప్పికొట్టింది. ఇరువర్గాల మధ్య దాదాపు 15 నిమిషాల పాటు ఫైరింగ్ జరిగినట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన వెల్లడించారు.

పాక్ కవ్వింపుల నేపథ్యంలో పూంచ్ సెక్టార్‎కు భారీగా బలగాలను తరలిస్తున్నట్లు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‎గా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్, భారత్ ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. నాలుగు రోజుల దాడులు అనంతరం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తాజాగా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. అయితే, ఉన్నఫలంగా బార్డర్లో పాక్ ఆర్మీ కాల్పుల జరపడం వెనక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎల్‌ఓసీ గుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‎లోకి చొరబడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు భద్రతా దళాలను అప్రమత్తం చేశాయి. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు ఎల్‌ఓసీ వెంబడి భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. బార్డర్లో సెక్యూరిటీ టైట్‎గా ఉండటంతో భారత ఆర్మీ దృష్టి మరల్చి ఉగ్రవాదుల చొరబాటుకు లైన్ క్లియర్ చేసేందుకు పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఫైరింగ్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.