
పాట్నా : బీహార్ లో మరో కిడ్నాప్ మ్యారేజ్(పకడ్వా వివాహం) జరిగింది. అబ్బాయిని బలవంతంగా ఎత్తుకపోయి, అతని తలపై గన్ పెట్టి బెదిరించి మరీ తన బిడ్డ మెడలో తాళి కట్టించాడో వ్యక్తి. బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. గౌతమ్ కుమార్ అనే యువకుడు ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్ పోస్టుకు సెలక్ట్ అయ్యాడు. పతేపూర్‌లోని రేపురాలో ఉన్న ఉత్ర్కమిత్ మధ్య విద్యాలయలో డ్యూటీలో జాయిన్ కూడా అయ్యాడు. ఎప్పటిలాగే బుధవారం స్కూల్ కి వెళ్లాడు. ఇంతలో స్కూల్ లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు గౌతమ్ ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత 24 గంటల్లోపే.. అతడికి కిడ్నాపర్లలో ఒకరి కూతురితో బలవంతంగా పెండ్లి జరిపించేశారు.
మరోవైపు..టీచర్ కిడ్నాప్ సమాచారం అందుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గౌతమ్ కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి రోడ్డును దిగ్బంధించి నిరసన చేపట్టారు. రాజేశ్ రాయ్ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డాడని ఆరోపించారు. అతని కూతురు చాందినిని పెండ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు గౌతమ్ ని చితకబాదారని తెలిపారు. అతని తలకు గన్ పెట్టి కాలుస్తామని బెదిరించి చాందినితో బలవంతంగా పెండ్లి చేశారని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, కిడ్నాపర్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. బీహార్‌లో ఇటీవల పకడ్వా వివాహాలు(అబ్బాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా పెండ్లి చేయడం) ఎక్కువయ్యాయి. బలవంతపు వివాహాల్ని రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు తీర్పు చెప్పినా పరిస్థితి మారలేదు.