బీజింగ్: పాకిస్తాన్‌తో తనకున్న సంబంధాల గురించి చైనా బయటపెట్టింది. చైనా–పాకిస్తాన్ మంచి సోదర దేశాలని, మిత్రులని డ్రాగన్ కంట్రీ ప్రెసిడెంట్ జిన్‌పింగ్ అన్నారు. ఇరు దేశాల మధ్య నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్.. ఇండియా తమదిగా చెబుతున్న భూభాగం నుంచి పోతోందని, ఇదే బీజింగ్, ఇస్లామాబాద్ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఆరిఫ్ అల్వీకి జిన్‌పింగ్ రికార్డ్ చేసిన మెసేజ్‌ను పంపించారు. చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టు మైలురాయి అని జిన్‌పింగ్ చెప్పారు.
‘చైనా–పాకిస్తాన్ లోతైన అభివృద్ధికి చాలా ప్రాముఖ్యం ఇస్తున్నాం. వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇరు దేశాల అభివృద్ధి కీలకం. చైనా–పాకిస్తాన్ కమ్యూనిటీ మెరుగైన భవిష్యత్ కోసం ఇరు దేశాల సంబంధాలను బలో పేతం చేస్తున్నాం. చైనా–పాకిస్తాన్ మంచి మిత్రులు, సోదరులు. మా ఫ్రెండ్‌షిప్ చాలా స్పెషల్. హై క్వాలిటీ బెల్ట్ రోడ్ నిర్మాణంపై లోతుగా చర్చించడానికి ఇరు దేశాల రాజకీయ పార్టీలు సమావేశం జరపాలి. పాకిస్తాన్‌తో కలసి పని చేస్తూ ప్రాంతీయ సంఘీభావాన్ని ప్రోత్సహించడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని జిన్‌పింగ్ పేర్కొన్నారు.
