పాక్ మరో కీలక నిర్ణయం.. FM‎లో భారత సినీ పాటలపై నిషేధం

పాక్ మరో కీలక నిర్ణయం.. FM‎లో భారత సినీ పాటలపై నిషేధం

ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు పోటాపోటీగా ఆంక్షలు విధించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పాక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ ఎఫ్ఎమ్ రేడియాల్లో భారతీయ సినీ పాటలపై నిషేధం విధిందించింది. ఈ మేరకు పాకిస్తాన్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (PBA) గురువారం (మే 1) వెల్లడించింది. ఇకపై పాకిస్తాన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్లలో భారతీయ పాటల ప్రసారంపై నిషేధం విధిస్తు్న్నట్లు పీబీఏ స్పష్టం చేసింది. 

కాగా, 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రమూకల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ ఘటనతో దాయాది పా‎క్‎పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషించి భారత్‎లో దాడులకు ప్రేరేపిస్తుండటంతో పాక్ తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆ దేశంపై పలు ఆంక్షలు విధించింది.

ఇండస్ వాటర్ ఒప్పంద రద్దు, పాక్ పౌరుల వీసాలు రద్దు, పాక్ నటులపై భారత్‎లో నిషేధం వంటి పలు ఆంక్షలు విధించింది. కొందరు పాకిస్థాన్ నటుల సోషల్ మీడియా ఖాతాలను కూడా బ్యాన్ చేసింది. అలాగే.. పాకిస్థాన్‎కు చెందిన పలు యూట్యూబ్ ఛానెళ్లను బ్యాన్ చేసింది. భారత చర్యలకు కౌంటర్‎గా పాక్ కూడా మన దేశంపై పలు ఆంక్షలు విధిస్తోంది. పాక్ గగనతలంలో భారత విమానాలపై నిషేధం, సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంది. తాజాగా.. పాకిస్తాన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్లలో భారతీయ పాటల ప్రసారంపై నిషేధం విధించింది. 

ALSO READ | తగ్గేదేలే.. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..! అమెరికా చెప్పిన వెనక్కి తగ్గని భారత్

2016లో ఉరిలోని భారత సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో పాకిస్తానీ నటులపై భారత నిషేధం విధించింది. దీంతో 2016 నుంచి పాక్ నటులు ఎవరూ భారత చిత్ర పరిశ్రమలో పని చేయలేదు. పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ అబీర్ గులాల్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. బాలీవుడ్ హీరోయిన్ వాణికపూర్ నటించిన ఈ చిత్రం 2025, మే 1న రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇంతలోనే పహల్గాంలో టెర్రర్ ఎటాక్ జరగడంతో భారత ప్రభుత్వం ఈ సినిమా నిషేధం విధించింది. ఫవాద్ చివరిసారిగా బాలీవుడ్ చిత్రం 'ఏ దిల్ హై ముష్కిల్ (2016)'లో యాక్ట్ చేశాడు.