ఇంగ్లండ్ పై పాక్‌‌ పంజా

ఇంగ్లండ్ పై పాక్‌‌ పంజా
  • 14 పరుగుల తేడాతో గెలుపు
  • రాణించిన హఫీజ్ , ఆజమ్ , బౌలర్లు
  • రూట్ , బట్లర్ సెంచరీలు వృథా

నాటింగ్‌‌హామ్‌‌: తొలి మ్యాచ్‌‌ ఓటమి నుంచి పాకిస్థాన్‌‌ తొందరగానే తేరుకుంది. ఇంగ్లండ్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ వణికించినా.. నాణ్యమైన బౌలింగ్‌‌తో భారీ టార్గెట్‌‌ను అద్భుతంగా కాపాడుకుంది. దీంతో సోమవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో పాక్‌‌ 14 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన పాకిస్థాన్‌‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు చేసింది. మహ్మద్‌‌ హఫీజ్‌‌ (62 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 84), బాబర్‌‌ ఆజమ్‌‌ (66 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 63), సర్ఫరాజ్‌‌ (44 బంతుల్లో 5 ఫోర్లతో 55 పరుగులు) రాణించారు. తర్వాత ఇంగ్లండ్‌‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 334 పరుగులే చేసింది. రూట్‌‌ (104 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 107), బట్లర్‌‌ (76 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 103) సెంచరీలతో దుమ్మురేపినా.. ప్రయోజనం లేకపోయింది.

బట్లర్​ గెలుపు ‘రూట్‌‌’ వేసినా..

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఇంగ్లండ్‌‌కు ఆరంభంలో ఏదీ కలిసి రాలేదు. 10 ఓవర్లు కూడా ముగియకముందే ఓపెనర్లు రాయ్‌‌ (8), బెయిర్‌‌స్టో (32) పెవిలియన్‌‌కు చేరారు. మూడో ఓవర్‌‌లో స్పిన్నర్‌‌ షాదాబ్‌‌ బాల్‌‌ను స్వీప్‌‌ చేయబోయి రాయ్‌‌ ఔటయ్యాడు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన రూట్‌‌ నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఎక్కడా తడబాటు లేకుండా పాక్‌‌ పేస్‌‌-–స్పిన్‌‌ కాంబినేషన్‌‌ను దీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డ్‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో 47 బంతుల్లోనే హాఫ్‌‌ సెంచరీ సాధించాడు. కానీ అవతలి ఎండ్‌‌లో మోర్గాన్‌‌ (9), స్టోక్స్‌‌ (13) నిరాశపర్చడంతో ఇంగ్లండ్‌‌ 22 ఓవర్లలో 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టింది. ఇంగ్లండ్‌‌ గెలుపు కష్టమే అనుకున్న దశలో బట్లర్‌‌ రాక ఇన్నింగ్స్‌‌ స్వరూపాన్ని మార్చేసింది. టవరింగ్‌‌ సిక్సర్లు, వేగవంతమైన బౌండరీలతో రెచ్చిపోయిన బట్లర్‌‌ 34 బంతుల్లో అర్ధసెంచరీ చేశారు. రూట్‌‌తో కలిసి నిలకడగా ఆడటంతో ఇంగ్లండ్‌‌ 32 ఓవర్లలో స్కోరు 200లు దాటింది. 38వ ఓవర్‌‌లో రియాజ్‌‌ బంతిని ఆఫ్‌‌సైడ్‌‌ పంపి ఈ వరల్డ్‌‌కప్‌‌లో రూట్‌‌ (97 బంతుల్లో) తొలి సెంచరీ ఫీట్‌‌ను అందుకున్నాడు.

కానీ.. తర్వాతి ఓవర్‌‌లో షాదాబ్‌‌ బంతిని థర్డ్‌‌ మ్యాన్‌‌ దిశలో ఆడబోయి హఫీజ్‌‌ చేతికి చిక్కాడు. దీంతో ఐదో వికెట్‌‌కు 130 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 248/5 స్కోరు వద్ద వచ్చిన మొయిన్‌‌ అలీ (19).. 3 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌‌ను సర్ఫరాజ్‌‌ మిస్‌‌ చేశాడు. 45వ ఓవర్‌‌లో ఆమిర్‌‌ బంతిని బౌండరీకి తరలించి సెంచరీ పూర్తి చేసిన బట్లర్‌‌.. తర్వాతి బాల్‌‌కే ఔట్‌‌కావడంతో మ్యాచ్‌‌ మలుపు తిరిగింది. బట్లర్‌‌తో ఆరో వికెట్‌‌కు 40 పరుగులు జోడించిన అలీ టైమింగ్‌‌తో ఇబ్బందిపడ్డాడు.  ఇక 33 బంతుల్లో 61 పరుగులు కావాల్సిన దశలో  వోక్స్‌‌ (21) ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించినా.. 48వ ఓవర్‌‌లో రియాజ్‌‌ డబుల్‌‌ ధమాకా ఇచ్చాడు. వరుస బంతుల్లో అలీ, వోక్స్‌‌ని ఔట్‌‌ చేయడంతో మ్యాచ్‌‌ పాక్‌‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆఖరి 12 బంతుల్లో 29 పరుగులు చేయడంలో ఆర్చర్‌‌ (1), ఆదిల్‌‌ (3 నాటౌట్​) విఫలమయ్యారు.

సెంచరీ లేకపోయినా..

గత మ్యాచ్‌‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పాక్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ ఈసారి పరిణతిని చూపెట్టారు.  హోస్ట్‌‌ పేసర్లపై ఎదురుదాడి చేసిన ఓపెనర్లు ఇమాముల్‌‌ (44), ఫఖర్‌‌ (36) తొలి వికెట్‌‌కు 82 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. 15వ ఓవర్‌‌లో మొయిన్‌‌ అలీ (3/50) ఫఖర్‌‌ను ఔట్‌‌ చేసి ఈ జోడీని విడదీశాడు.  మరో ఆరు ఓవర్ల తర్వాత అలీ బౌలింగ్‌‌లో ఇమాముల్‌‌ కొట్టిన లాఫ్టెడ్‌‌ షాట్‌‌ను వోక్స్‌‌ డైవ్‌‌ చేస్తూ అద్భుతంగా ఒడిసిపట్టాడు. అప్పటికే జట్టు స్కోరు 111కు చేరడంతో..  ఆజమ్‌‌, హఫీజ్‌‌ ఇన్నింగ్స్‌‌లో స్థిరత్వాన్ని తెచ్చారు. స్పిన్నర్‌‌ రషీద్‌‌ వరుస బంతులను సిక్స్‌‌, ఫోర్‌‌గా మలిచి జోరు పెంచిన ఆజమ్‌‌… ఫీఫ్టీ తర్వాత వెనుదిరిగాడు. ఈ దశలో కెప్టెన్‌‌ సర్ఫరాజ్‌‌.. హఫీజ్‌‌కు చక్కని సహకారం అందించాడు.

14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాయ్‌‌ క్యాచ్‌‌ మిస్‌‌ చేయడంతో గట్టెక్కిన హఫీజ్‌‌.. కేవలం 39 బంతుల్లోనే హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత కూడా అదే జోరుతో రన్‌‌రేట్‌‌ కొనసాగించాడు. 80 పరుగుల వద్ద వుడ్‌‌ బంతిని లాంగాన్‌‌లో భారీ సిక్సర్‌‌గా మలిచే ప్రయత్నంలో వోక్స్‌‌ క్యాచ్‌‌ మిస్‌‌ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. నాలుగో వికెట్‌‌కు 80 పరుగులు జత చేసి హఫీజ్‌‌ వెనుదిరిగాడు. అప్పటికీ జట్టు స్కోరు 279/4. ఆసిఫ్‌‌ అలీ (14) నిరాశపర్చినా.. సర్ఫరాజ్‌‌ 40 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేయడంతో పాక్‌‌ స్కోరు 300లు దాటింది. ఐదో వికెట్‌‌కు 32 పరుగులు జోడించి ఆసిఫ్​ ఔటయ్యాడు. చివర్లో వోక్స్‌‌ విజృంభించి స్వల్ప విరామాల్లో…  సర్ఫరాజ్, మాలిక్‌‌ (8), రియాజ్‌‌ (4)ను ఔట్‌‌ చేసినా హసన్‌‌ (10 నాటౌట్‌‌), షాదాబ్‌‌ (10 నాటౌట్‌‌) వేగంగా ఆడటంతో పాక్‌‌ భారీ టార్గెట్‌‌ను నిర్దేశించింది.

స్కోర్ బోర్డు

పాకిస్థాన్ : ఇమాముల్ (సి)వోక్స్ (బి) అలీ 44, ఫకర్జమాన్ (స్టంప్ ) బట్లర్ (బి) అలీ36, బాబర్ ఆజమ్ (సి) వోక్స్ (బి) అలీ 63, హఫీజ్(సి) వోక్స్ (బి) వుడ్ 84, సర్పరాజ్ (సి అండ్ బి)వోక్స్ 55, ఆసిఫ్ అలీ (సి) బెయిర్ సోట్ (బి) వుడ్ 14,షోయబ్ (సి) మోర్గాన్ (బి) వోక్స్ 8, రియాజ్ (సి)రూట్ (బి) వోక్స్ 4, హసన్ అలీ (నాటౌట్) 10,షాదాబ్ ఖాన్ (నాటౌట్ ) 10, ఎక్స్ ట్రాలు: 20,మొత్తం: 50 ఓవరల్లో 348/8. వికెట్ల పతనం:1–82, 2–111, 3–199, 4–279, 5–311,6–319, 7–325, 8–337.బౌలింగ్ : వోక్స్ 8–1–71–3, ఆ 10–0–79–0, అలీ 10–0–50–3, వుడ్ 10–0–53–2, స్టోక్స్7–0–43–0, రషీద్ 5–0–43–0.

ఇంగ్లండ్ : రాయ్ ఎలీబ్ (బి) షాదాబ్ 8, బెయిర్  స్టో(సి) సర్ఫరాజ్ (బి) రియాజ్ 32, రూట్(సి) హఫీజ్ (బి) షాదాబ్ 107,మోర్గాన్ (బి) హఫీజ్ 9, స్టోక్స్ (సి) సర్ఫరాజ్ (బి) షోయబ్ మాలిక్ 13,బట్లర్ (సి) రియాజ్ (బి) ఆమిర్ 103,అలీ (సి) ఫఖర్ (బి) రియాజ్ 19, వోక్స్(సి) సర్ఫరాజ్ (బి) రియాజ్ 21, ఆర్చర్ (సి)రియాజ్ (బి) ఆమిర్ 1, రషీద్ (నాటౌట్ ) 3, వుడ్(నాటౌట్ ) 10, ఎక్స్ ట్రాలు: 8, మొత్తం: 50 ఓవరల్లో 334/9. వికెట్ల పతనం: 1–12, 2–60,3–86, 4–118, 5–248, 6–288, 7–320,8–320, 9–322.బౌలింగ్ : షాదాబ్ 10–0–63–2, ఆమిర్ 10–0–67–2, రియాజ్ 10–0–82–3, హసన్ అలీ 10-–0–66–0, హఫీజ్ 7–0–43–1, షోయబ్ మాలిక్ 3–0–10–1