PAK vs SA: చివరి రెండు వికెట్లకు 169 పరుగులు.. 11వ స్థానంలో పాకిస్థాన్‌పై రబడా విధ్వంసకర ఇన్నింగ్స్

PAK vs SA: చివరి రెండు వికెట్లకు 169 పరుగులు.. 11వ స్థానంలో పాకిస్థాన్‌పై రబడా విధ్వంసకర ఇన్నింగ్స్

రావల్పిండి క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. మూడో రోజు ఆటలో భాగంగా తొలి సెషన్ లో చక చక వికెట్లు తీసిన పాకిస్థాన్ కు లోయర్ ఆర్డర్ తలనొప్పిగా మారారు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ విలువైన ఆధిక్యాన్ని సంపాదించడం విశేషం. ముఖ్యంగా రబడా ఆడిన మెరుపు ఇన్నింగ్స్ బుధవారం (అక్టోబర్ 22) హైలెట్ గా మారింది. రబడాతో ముత్తుస్వామి కీలక ఇన్నింగ్స్ ఆడితే మహారాజ్ రాణించాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో రాణించడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. 

క్రీజ్ లో బాబర్ అజామ్ (49), మహమ్మద్ రిజ్వాన్ (16) ఉన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ లో 23 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 4 వికెట్ల నష్టానికి 185 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆరంభంలోనే వికెట్ కీపర్ వెర్రెన్ వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసిన స్టబ్స్ 76 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కు చేరాడు. మార్కో జాన్సెన్, హార్మర్ కూడా తక్కువ పరుగులకే ఔటై నిరాశపరిచారు. దీంతో సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఈ దశలో అసలు ఆట  మొదలయింది. పాక్ బౌలర్లను విసిగిస్తూ ముత్తుస్వామి, మహారాజ్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

9 వికెట్ కు 71 పరుగులు జోడించి జట్టు స్కోర్ ను 300 పరుగులు దాటించారు. ఎట్టకేలకు మహరాజ్ వికెట్ తీసుకున్న పాకిస్థాన్ ఊపిరి పీల్చుకుంది. అయితే 11 వ స్థానంలో వచ్చిన రబడా పాకిస్థాన్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. బౌండరీల మోత మోగిస్తూ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సఫారీలకు ఆధిక్యాన్ని అందించాడు. ఓవరాల్ గా 61 బంతుల్లో 71 పరుగులు చేసిన ఈ స్పీడ్ స్టార్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 333 పరుగులు చేస్తే.. సౌతాఫ్రికా 404 పరుగులు చేసి 71 పరుగులు ఆధిక్యాన్ని సంపాదించింది.