పుల్వామా దాడి మేమే చేశాం

పుల్వామా దాడి మేమే చేశాం
  •     ఇండియాను సొంత గడ్డపైనే దెబ్బతీశామని కామెంట్ 
  •    నేషనల్ అసెంబ్లీలో ఒప్పుకున్నపాక్ మంత్రి ఫవాద్

ఇస్లామాబాద్: పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది. పుల్వామా దాడి తామే చేశామని ఆ దేశం ఒప్పుకుంది. ఆ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ చౌధురి స్వయంగా నేషనల్ అసెంబ్లీలో గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఇండియాను సొంత గడ్డపైనే దెబ్బతీశాం. పుల్వామా దాడి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో సాధించిన గొప్ప విజయం. ఇందులో మనమందరం భాగస్వాములం” అని ఫవాద్ అన్నారు. ఆ దేశ అపోజిషన్ లీడర్ అయాజ్ సాదిక్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ గా ఫవాద్ ఈ మాటలన్నారు. ఫవాద్ కామెంట్స్ పై అసెంబ్లీలో దుమారం రేగడంతో తర్వాత ఆయన మాట మార్చారు. ‘‘పుల్వామా దాడి తర్వాత ఇండియాకు సొంత గడ్డపైనే గట్టి జవాబు ఇచ్చాం” అని పేర్కొన్నారు. పోయినేడాది పుల్వామాలో సీఆర్పీఎఫ్​ క్వాన్వాయ్​పై జరిగిన దాడిలో 40 మంది మన జవాన్లు చనిపోయారు.

సాదిక్ ఏమన్నాడంటే…

ఇండియన్​ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదల విషయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా వణికిపోయాడని పాకిస్తాన్ ముస్లిం లీగ్–-నవాజ్ (పీఎంఎల్-–ఎన్) పార్టీ లీడర్ సర్దార్ అయాజ్ సాదిక్ చెప్పారు. అభినందన్ ను విడిచిపెట్టకపోతే మన దేశం పాక్ పై దాడి చేస్తుందని భయపడిపోయాడని బుధవారం నేషనల్ అసెంబ్లీలో వెల్లడించారు. ‘‘ఆ రోజు ఫారిన్ మినిస్టర్ షా మహమ్మద్ ఖురేషీ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆర్మీ చీఫ్​జనరల్ బజ్వా లోపలికి వచ్చారు. ఆ టైమ్ లో ఆయన కాళ్లు, చేతులు వణికాయి. చెమటలు పట్టాయి. అభినందన్ ను విడుదల చేయకపోతే ఇండియా మన దేశంపై రాత్రి 9గంటలకు దాడి చేస్తుందని ఖురేషీ చెప్పారు. అభినందన్​ను విడుదల చేయాలన్నారు. దానికి మేంకూడా ఒప్పుకున్నాం” అని సాదిక్ ఆనాడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.  ‘‘పాక్ పై ఎటాక్ చేసేందుకు ఇండియా ప్లాన్ చేయలేదు. మనవాళ్లే ఇండియా ముందు మోకరిల్లి, అభినందన్​ను విడిచిపెట్టారు” అని సాదిక్ చెప్పారు. పోయినేడాది ఫిబ్రవరి 27న మన పైలట్ అభినందన్ పాక్​కు చిక్కిన విషయం తెలిసిందే. ఆయనను నిర్బంధించిన పాక్.. తర్వాత చర్చలతో మార్చి 1న విడుదల చేసింది.

కాంగ్రెస్ ఇకనైనా మారాలి: నడ్డా

పాక్ లీడర్ కామెంట్స్ తో బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ కు మన దేశంపై, ఆర్మీపై, ప్రజలపై నమ్మకం లేదు. ఇప్పుడు వాళ్ల ఫ్రెండ్ అయిన పాకిస్తాన్ చెప్పినంకనైనా కాంగ్రెస్ మారాలి” అని నడ్డా ట్వీట్ చేశారు.