అవసరమైతే యుద్ధానికి సిద్ధం

అవసరమైతే యుద్ధానికి సిద్ధం
  • యూఎన్ సహా ప్రపంచ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తుతాం
  • పీవోకే అసెంబ్లీలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
  • కాశ్మీర్‌‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తాం

ఇస్లామాబాద్: కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతామని, అవసరమైతే యుద్ధానికి సిద్ధమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇండియా, పాక్ మధ్య యుద్ధం మొదలైతే దానికి ప్రపంచ దేశాలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జమ్మూకాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై ఆయన బుధవారం పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడేందుకు తమ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆర్ఎస్ఎస్ ను విమర్శించిన ఆయన ఇండియాలో ముస్లింలపై మూక దాడులు జరుగుతున్నాయన్నారు. కాశ్మీర్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ముస్లిం కమ్యూనిటీకి హెచ్చరికలాంటివని చెప్పారు.  ఇండియన్ గవర్నమెంట్ వ్యూహాత్మక తప్పిదం చేసిందని, ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కాశ్మీర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారి యునైటెడ్ నేషన్స్ సహా  ప్రపంచంలోని అన్ని వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో ఈ అంశంపై మాట్లాడినట్లు తెలిపారు. ఓఐసీ సమావేశంలో దీన్ని ప్రస్తావిస్తామన్నారు. ఇండియాలో ఉన్న 18 కోట్ల మంది ముస్లింలకు ప్రమాదం పొంచి ఉందని ఆరోపించారు. టెర్రరిజంపై తమ ఆర్మీ 20 ఏళ్లుగా పోరాడుతోందని చెప్పారు. కాశ్మీర్ లో పరిణామాలను గమనిస్తున్నామని, ఎలాంటి ఉల్లంఘనలను సహించబోమన్నారు. తమ దేశం ఆంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకోరాదని ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది.