V6 News

తుర్కుమెనిస్తాన్లో పాక్ ప్రధానికి భంగపాటు!

తుర్కుమెనిస్తాన్లో పాక్ ప్రధానికి భంగపాటు!
  •     రష్యా అధ్యక్షుడు పుతిన్​తో భేటీ 40 నిమిషాలు లేట్ 
  •     అసహనంతో పుతిన్, ఎర్దోగన్ మీటింగ్ రూంలోకి వెళ్లిన షెహబాజ్ షరీఫ్​ 
  •     ఆ తర్వాత 10 నిమిషాలకే తిరుగు పయనం

యాష్గబాట్: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్​కు తుర్కుమెనిస్తాన్​లో చేదు అనుభవం ఎదురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ 40 నిమిషాలు ఆలస్యం కావడంతో తీవ్ర అసహనానికి గురైన షరీఫ్.. పుతిన్ మీటింగ్​లో ఉన్న రూంలోకి తలుపు తీసుకుని మరీ వెళ్లారు. ఓ హాల్​లో తన టీమ్​తో అసహనంతో ఒంటరిగా కూర్చున్న షరీఫ్.. లేచి వడివడిగా నడుస్తూ పుతిన్ ఉన్న రూం తలుపు తీసుకుని లోపలికి పోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏ దేశంతోనూ సైనిక కూటమి కట్టబోమని, తమ భూభాగంలో ఏ దేశానికీ మిలిటరీ బేస్​లకు స్థలం ఇవ్వబోమని, తమపై దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం తప్ప ఇతర దేశాలపై దాడులు చేయకుండా.. ‘పర్మనెంట్ న్యూట్రాలిటీ కంట్రీ’గా ఉంటామంటూ తుర్కుమెనిస్తాన్ 1995 డిసెంబర్ 12న పాలసీని ప్రకటించింది. శుక్రవారం నాటికి ఈ పాలసీ అమలులోకి వచ్చి 30 ఏండ్లు అయిన సందర్భంగా తుర్కుమెనిస్తాన్ రాజధాని యాష్గబాట్​లో అంతర్జాతీయ సమిట్​ను నిర్వహించింది. సమిట్​కు పుతిన్ తోపాటు తుర్కియే ప్రెసిడెంట్ రిసెప్ తయ్యిప్ ఎర్దోగన్, ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్, పాక్ ప్రధాని షరీఫ్, ఇతర పలు దేశాల అధినేతలు పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా పుతిన్​తో భేటీ కోసం పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, అధికారులతో కలిసి షరీఫ్​ ఓ హాల్​లో వెయిట్ చేశారు. అదేసమయంలో పక్క హాల్ లో ఎర్దోగన్, పుతిన్ భేటీ అయ్యారు. షెడ్యూల్ టైం దాటి 40 నిమిషాలవుతున్నా.. పుతిన్​తో సమావేశం ప్రారంభం కాకపోవడంతో షరీఫ్​ గోళ్లు కొరుక్కుంటూ అసహనానికి గురయ్యారు. తర్వాత లేచి నేరుగా పుతిన్, ఎర్దోగన్ ఉన్న రూం తలుపులు తీసుకుని మరీ వెళ్లారు. అయితే, పది నిమిషాల్లోనే ఆయన తిరిగి బయటకు వచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోయారని 
‘ఆర్ టీ ఇండియా’ మీడియా సంస్థ వెల్లడించింది.