ఇండియాకు రావాలంటే చాలా భయపడ్డా

ఇండియాకు రావాలంటే చాలా భయపడ్డా

న్యూఢిల్లీ: భారత్ కు రావాలంటే చాలా భయపడ్డానని పాకిస్థానీ నటి మహీరా ఖాన్ చెప్పింది. 2016లో ఉరి అటాక్ అనంతరం ఇండియా, పాకిస్థాన్ సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో దాయాది దేశానికి చెందిన నటీనటులతో నటించబోమని ఆలిండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో  ఆ సమయంలో బాలీవుడ్ లో యాక్ట్ చేయకుండా పాక్ నటులపై బ్యాన్ విధించారు. 2019లో పుల్వామా దాడుల తర్వాత కూడా ఇదే నిషేధాన్ని వేశారు. అయితే ఈ టైమ్ లో పలు వెబ్ సిరీస్ ల్లో, సినిమాల్లో తనకు ఆఫర్లు వచ్చాయని.. కానీ భారత్ కు రావాలంటే భయపడ్డానని మహీరా ఖాన్ వాపోయింది. 

'నేను చాలా భయపడ్డా. అవును, ఆ సమయంలో నాకు డిజిటల్ లో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ నిజాయితీగా చెప్పాలంటే.. నేను భయపడ్డా. అందుకే ఇండియాకు వెళ్ళలేకపోయాను' అని ఓ ఇంటర్వ్యూలో మహీరా స్పష్టం చేసింది. ప్రముఖ సింగర్ అడ్నాన్ సమీ కుమారుడు అజాన్ తో కలసి ఆమె ఈ ఇంటర్వ్యూలో పాల్గొంది. కాగా, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన రయీస్ మూవీతో హిందీ ఇండస్ట్రీకి మహీరా పరిచయమైంది. ఈ మూవీలో ఆమె అందానికి మంచి మార్కులు పడ్డాయి.