లండన్లో సిక్కు బాలికను కిడ్నాప్ చేసిన పాకిస్తాన్ ముఠా

లండన్లో సిక్కు బాలికను కిడ్నాప్ చేసిన పాకిస్తాన్ ముఠా
  •     నిందితుని అరెస్టు చేసి.. బాలికను పేరెంట్స్​కు అప్పగించిన పోలీసులు

హౌన్స్​లో: లండన్‌‌లో ఓ పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్ 16 ఏండ్ల సిక్కు బాలికను కిడ్నాప్ చేసింది. ఆపై ఆమెపై లైంగిక దాడికి కూడా పాల్పడినట్టు తెలిసింది. దీంతో విషయం తెలుసుకున్న సిక్కు సమాజం సభ్యులు.. నిందితుడి ఫ్లాట్​వద్దకు చేరుకున్నారు. అనంతరం పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకొని.. బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. వెస్ట్​ లండన్‌‌లోని హౌన్స్‌‌లో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 నుంచి 40 ఏండ్ల వయసున్న పాకిస్తాన్ గ్రూమింగ్ ముఠాకు చెందిన నిందితుడు.. సిక్కు బాలికకు 13 ఏండ్ల వయస్సు ఉన్నప్పటి నుంచే ఆమెతో ఫ్రెండ్​షిప్ ప్రారంభించాడని తెలిసింది. 

నిందితుడు సిక్కు బాలికకు 16 ఏండ్లు నిండిన తర్వాత ఆమెను తన కుటుంబం నుంచి విడదీసి.. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని తనతో పాటు ఫ్లాట్​లో ఉంచుకుంటున్నాడని తెలిసింది. దీంతో తొలుత పోలీసులు కూడా బాధిత కుటుంబానికి సహాయం చేయలేకపోయారు. అయితే, సిక్కు కమ్యూనిటీ గ్రూపులు ఆమెను రక్షించడానికి రంగంలోకి దిగాయి. సుమారు 200 మంది నిందితుడి ఫ్లాట్​వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని ఆ బాలికను తిరిగి తన కుటుంబానికి అప్పగించారు.