
హైదరాబాద్: ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాక్ ప్లేయర్లు తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.. కానీ అవేమి పట్టించుకోకుండా ప్రశాంతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించానన్నాడు ఆసియా కప్ ఫైనల్ హీరో, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ. మంగళవారం (సెప్టెంబర్ 30) హైదరాబాద్‌లో తిలక్ వర్మ మీడియాతో మాట్లాడాడు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆసియా కప్‌కు పాకిస్తాన్ ప్లేయర్లు కోపంగా వచ్చారని.. గ్రౌండ్లో మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తెలిపాడు. పాక్ ప్లేయర్ల రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోకుండా దేశం నిలబడ్డానని అన్నాడు. ఫైనల్ మ్యాచులో ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని.. అన్నీ పరిస్థితులను గమనిస్తూ ప్రశాంతంగా బ్యాటింగ్ చేశానని చెప్పాడు. చివరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ని ఫినిష్ చేస్తానని కాన్ఫిడెంట్‌గా ఉన్నానన్నాడు.
క్రికెట్‌ను ఎమోషనల్‌గా తీసుకోవద్దని.. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని ఓపిక, సహనంతో ఆడాలన్నాడు. పాక్‌తో ఫైనల్ మ్యాచుకు ముందే గ్రౌండ్లో ఒత్తిడికి గురికావొద్దని డ్రెస్సింగ్ రూములో టీమ్ మొత్తం చర్చించుకున్నామని తెలిపాడు. ఫైనల్ మ్యాచులో మొదట్లోనే 3 వికెట్లు పడటంతో కొంత టెన్షన్‌కు గురయ్యాం. అప్పటి నుంచి మరింత జాగ్రత్తగా ఆడామని చెప్పాడు. వచ్చే జనవరిలో వరల్డ్ కప్ ఉందని.. అదే నా టార్గెట్ అని స్పష్టం చేశాడు తిలక్.
ఇండియా–పాక్ మధ్య మ్యాచ్ ఎలా ఉండాలని సగటు అభిమాని కోరుకుంటాడో ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ పోరు అచ్చం అలానే సాగింది. అనూహ్య మలుపులు తిరుగుతూ ఉర్రూతలూగించింది. ఓవర్ ఓవర్ కు ఆధిపత్యం చేతులూ మారుతూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. తొలి పది ఓవర్లలో బ్యాటింగ్‌లో ఓ రేంజ్‌లో విజృంభిస్తున్న పాక్‌ను ఇండియా స్పిన్నర్లు చుట్టేశారు.
180 స్కోరు పక్కా అనుకుంటే 150 కూడా దాటకుండా పడగొట్టేశారు. 147 రన్స్ చిన్న టార్గెట్ ఛేజింగ్ ఇండియాకు నల్లేరు మీద నడకే అనుకుంటే.. నాలుగు ఓవర్లు తిరిగే సరికి టాప్–3 బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టేశారు. పాక్ చేతిలో ఓడిపోతే ఎలా అన్న భయం మెల్లగా మొదలైంది.
హార్ట్‌బీట్ అమాంతం పెరిగింది. అప్పుడొచ్చాడు మన హైదరా‘బాద్‌షా’ తిలక్ వర్మ. క్రికెట్ వరల్డ్‌లోనే అతి పెద్ద మ్యాచ్‌లో .. అత్యంత ఒత్తిడిలోనూ నిర్భయంగా.. అద్భుతంగా ఆడుతూ పాక్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఇటుకా ఇటుకా పేరుస్తూ తన కెరీర్‌లో చిరకాలం నిలిచిపోయే ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించి హీరో అయ్యాడు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ.