
హైదరాబాద్: యజమాని చెర నుంచి తప్పించుకునేలా తెలంగాణ యువకుడికి పాకిస్థానీ వర్కర్లు సాయపడ్డారు. దీంతో మరి కొద్ది రోజుల్లో అతడు హాయిగా సొంతూరుకు రాబోతున్నాడు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ సమీర్ (21) అనే యువకుడు, సౌదీలో తన యజమాని పెడుతున్న కష్టాలను వీడియో ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎడారిలో గొర్రెలకు కాపలాగా తనను పెట్టారని, చిత్రహింసలు పెడుతున్నారని, వెంటనే ఇండియాకు తీసుకెళ్లేలా సాయం చేయాలని ఆ వీడియోలో సమీర్ కోరాడు. ఆ వీడియో వైరల్ కావడంతో అక్కడే ఉన్న గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాత్కూరి బసంత్ రెడ్డి స్పందించారు.
సౌదీలోనే పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన కొందరు వర్కర్లకు అతడి జాడ కనుక్కోవాల్సిందిగా పురమాయించారు. అలా అలా ఎడారిలో అతడి ఆచూకీని వెతుక్కుంటూ 500 కిలోమీటర్లు వెళ్లిన రాష్ట్ర వర్కర్లకు వేరే చోట పనిచేస్తున్న పాకిస్థాన్ వర్కర్లు సాయపడ్డారు. అతడున్న చోటుకు వారిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి బయట పడేదాకా వెన్నంటే ఉండి సాయం చేశారు. ఆ యజమాని దగ్గరి నుంచి తప్పించారు. ఇప్పుడు సమీర్ క్షేమంగా ఉన్నాడని బసంత్ రెడ్డి చెప్పారు. సమీర్ పరిస్థితిని పాకిస్థాన్ వర్కర్లకు వివరించడంతో సాయం చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. అదును చూసి అతడిని బయటపడేశారన్నారు. ఇప్పుడు సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీకి సమీర్‌ను పంపుతామని, అక్కడి నుంచి ఇండియాకు వచ్చేస్తాడని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన మిత్రుల సాయంతోనే తాను ఆ ఎడారి నుంచి తప్పించుకోగలిగానని సమీర్ చెప్పాడు. తనను ఓనర్ ఎన్నెన్నో కష్టాలు పెట్టాడని, ఇండియాకు తిరిగి వెళ్లిపోతానంటే మరింత టార్చర్ పెట్టేవాడని ఆవేదన చెందాడు. చాలా సార్లు తనను యజమాని కొట్టాడని అన్నాడు