ఇమ్రాన్​పై విదేశీ కుట్రకు ఆధారాలు ఇవ్వండి

ఇమ్రాన్​పై విదేశీ కుట్రకు ఆధారాలు ఇవ్వండి
  • పీటీఐ తరఫు లాయర్​ను అడిగిన పాక్​సుప్రీం కోర్టు
  • పూర్తి వివరాలు ఇవ్వాలని ఏజీపీ ఆదేశాలు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌ ను పదవి నుంచి తొలగించేందుకు విదేశీ శక్తలు కుట్రపన్నాయనే ఆరోపణలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు పాక్ సుప్రీ కోర్టు చీఫ్​ జస్టిస్ ఉమర్ అట బందియల్ అన్నారు. ఆదివారం ఇమ్రాన్ పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌ ఖాసీం సురి తిరస్కరించడం... ఆ వెంటనే నిమిషాల వ్యవధిలో ఇమ్రాన్ పార్లమెంట్‌‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం  విచారణ చేపట్టింది. ‘‘ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని డిస్మిస్ చేసే  అధికారం డిప్యూటీ స్పీకర్​కు ఉందా? లేదా? పరిశీలిస్తం. ఇమ్రాన్​పై విదేశీ కుట్రను కూడా తెలుసుకోవాలనుకుంటున్నం” అని సీజే అన్నారు. కుట్రకు సంబంధించి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్​మీటింగ్​లో చర్చ జరిగిందా? ఆధారాలు, వివరాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని పాకిస్థాన్ తెహ్రీక్​ఏ ఇన్సాఫ్(పీటీఐ) తరఫున వాదనలు వినిపిస్తున్న బాబర్ అవాన్​ను అడిగింది.   అలాగే అటార్ని జనరల్​ఆఫ్​ పాకిస్థాన్​ను తన వాదనలు తరువాతి విచారణలో వినిపించాలని ఆదేశిస్తూ కేసును గురువారానికి వాయిదా వేశారు.

పాక్​ వీడుతున్న ఇమ్రాన్ సన్నిహితులు
పాక్​లో ఇమ్రాన్‌‌ ఖాన్ సర్కార్‌‌ సంక్షోభంలో పడడంతో ఆయన స‌‌న్నిహితులు దేశం విడిచి వెళ్తున్నారు. బుధవారం ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ స్నేహితురాలు ఫ‌‌రాహ్‌‌ ఖాన్‌‌ పాక్​ను వీడి దుబాయ్ వెళ్లారు. ఆ సమయంలో ఆమె చేతిలో 90 వేల డాలర్ల (రూ.68 లక్షలు) బ్యాగ్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ బ్యాగ్​తో ఆమె విమానంలో ఉన్న ఫోటోలు సోషల్​మీడిలో వైరల్ అయ్యాయి. ఇమ్రాన్ భార్యను అడ్డుపెట్టుకొని ఫ‌‌రాహ్‌‌ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిన‌‌ట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.