మూడు నదులు ఉన్నా నీటి ఎద్దడి తప్పట్లే : రాఘవాచారి

మూడు నదులు ఉన్నా నీటి ఎద్దడి తప్పట్లే : రాఘవాచారి
  • ఉమ్మడి పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి

కొల్లాపూర్, వెలుగు: పక్కనే మూడు నదులు పారుతున్నా ఉమ్మడి పాలమూరు జిల్లాకు నీటి ఎద్దడి తప్పట్లేదని ఉమ్మడి పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్  ఎం రాఘవాచారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కొల్లాపూర్ లో చంద్రసాగర్, అమ్రాబాద్  ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టాలని రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం గద్వాల జిల్లా కన్వీనర్  ఎండీ ఇక్బాల్ పాషా, డీటీఎఫ్  రాష్ట్ర కౌన్సిలర్  కె వామన్ కుమార్ తో కలిసి మాట్లాడారు. 

కృష్ణ, బీమా, తుంగభద్ర నదులు పక్క నుంచి పారుతున్నా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీళ్లు వాడుకునే ఏర్పాటు లేకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఏపీలో 2 లక్షల క్యూసెక్కుల నీళ్లు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేశారని, అయితే పాలమూరు జిల్లా వైపు నీళ్లను  తీసుకునే వ్యవస్థ లేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును శ్రీశైలంకు  తీసుకొచ్చి దెబ్బకొట్టారని, శ్రీశైలం నుంచి తోడి పోసిన నీళ్లను నల్గొండకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. 

ఉమ్మడి జిల్లాలో 35 లక్షల ఎకరాల భూములకు 350 టీఎంసీలు అవసరం కాగా, 60  టీఎంసీలు మాత్రమే తీసుకునే పరిస్థితి ఉందన్నారు. వెల్లటూరు, గొందిమల్ల బ్యారేజీ నిర్మించి నీటి గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. మహబూబ్ నగర్  నుంచి నల్గొండకు నీళ్ల తరలింపును ఆపాలని కోరారు.