నారాయణపేట్- –కొడంగల్​ .. లిఫ్ట్​ స్కీం చేపట్టండి : పాలమూరు ఎమ్మెల్యేలు

నారాయణపేట్- –కొడంగల్​ .. లిఫ్ట్​ స్కీం చేపట్టండి : పాలమూరు ఎమ్మెల్యేలు
  • మంత్రి ఉత్తమ్​ను కోరిన పాలమూరు ఎమ్మెల్యేలు
  • ప్రయారిటీ లిస్టులో ఉందన్న మంత్రి

హైదరాబాద్, వెలుగు: నారాయణపేట్– కొడంగల్​లిఫ్ట్​స్కీం ప్రాజెక్టు చేపట్టాలని పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని కోరారు. సోమవారం సెక్రటేరియెట్​లోని మంత్రి చాంబర్​లో ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాస్​రెడ్డి, జి.మధుసూదన్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్​రెడ్డి మంత్రితో సమావేశమయ్యారు. 2014 మే 23న ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మహబూబ్​నగర్​జిల్లాలోని కరువు ప్రభావ ప్రాంతాలైన నారాయణపేట్, మక్తల్, కొడంగల్​నియోజకవర్గాల్లోని 2.04 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు నారాయణపేట్​– కొడంగల్​లిఫ్ట్​స్కీం సర్వే, ఇతర పనుల కోసం రూ.133.86 కోట్లు మంజూరు చేస్తూ జీవో 69 ఇచ్చిందని ఎమ్మెల్యేలు వివరించారు.

ఇందులో సర్వే కోసం రూ.3.36 కోట్లు, భూ సేకరణ కోసం రూ.130.50 కోట్లు ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని వివరించారు. ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్​ప్రభుత్వం రద్దు చేసిందని, దీంతో కరువు ప్రభావ ప్రాంతాలకు తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నారాయణపేట్​– కొడంగల్​లిఫ్ట్​స్కీం పనులు చేపట్టాలని, వచ్చే బడ్జెట్​లోనే దీనికి నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రాధాన్యతగా పెట్టుకుందని, సీఎం రేవంత్​రెడ్డి ఈమేరకు ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు.

పాలమూరును నాశనం చేశారు: యెన్నం

ఎక్కడో కరీంనగర్​లో ఉన్న కేసీఆర్​ను తీసుకువచ్చి పాలమూరు ఎంపీని చేస్తే సీఎం అయ్యాక ఆ జిల్లా రైతులను నాశనం చేశారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. మంత్రితో సమావేశం తర్వాత సెక్రటేరియెట్ ​మీడియా సెంటర్​లో ఆయన మాట్లాడారు. 2014లోపే ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాలో 70 శాతం ఇరిగేషన్​ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయని, వాటిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.

జూరాల నుంచి 7 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పాలమూరు ఎత్తిపోతలను పక్కన పెట్టి శ్రీశైలం నుంచి రూ.32 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారని, ఒక్క ఎకరానికి నీళ్లివ్వలేదన్నారు. రేవంత్​ రెడ్డికి పేరు వస్తుందనే గత ప్రభుత్వం నారాయణపేట్– కొడంగల్​ లిఫ్ట్ ​స్కీంను తొక్కి పెట్టిందని మాజీ ఎమ్మెల్యే వంశీచంద్​రెడ్డి అన్నారు. కోయిల్​సాగర్​ప్రాజెక్టు సామర్థ్యాన్ని మరో 2 టీఎంసీలకు పెంచాలని కోరామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. సాగునీటి సౌకర్యం లేకనే ప్రజలు ఇప్పటికీ వలస పోతున్నారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.