పాలమూరును ఐటీ హబ్‌‌గా చేస్తామన్నరు.. ఏమైంది?

పాలమూరును ఐటీ హబ్‌‌గా చేస్తామన్నరు.. ఏమైంది?

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌‌పై షర్మిల ఫైర్ 
ఐటీ ఇండస్ట్రీ కోసం ఇచ్చిన భూములు ఎటుపోయినయ్‌‌? 

మహబూబ్‌‌నగర్, వెలుగు: ఎక్సైజ్‌‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌‌కు​ సంపాదన మీద తప్ప, పాలమూరు జిల్లా అంటే ప్రేమ లేదని వైఎస్సార్‌‌‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. మహబూబ్‌‌నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఆమె చేపట్టిన ‘పాలమూరు- నీళ్ల పోరు’24 గంటల దీక్ష గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా పార్టీ లీడర్లు ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తర్వాత షర్మిల మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా గెలిచాక శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ గట్టిగానే సంపాదించారని ఆరోపించారు. తాను బీసీ లీడర్‌‌‌‌నని చెప్పుకునే ఆయన.. ఏనాడైనా బీసీలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. పాలమూరు యూనివర్సిటీలో 120 మంది ప్రొఫెసర్లకు గాను, 20 మందే ఉంటే, చదువులెట్లా సాగుతాయని ప్రశ్నించారు. పాలమూరును మరో ఐటీ హబ్‌‌గా తీర్చిదిద్దుతామని, 20 వేల మందికి కొలువులు ఇప్పిస్తామని హామీలు ఇచ్చి, ఇప్పుడు ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చారా? అని నిలదీశారు. ఐటీ హబ్ కోసం 400 ఎకరాలు సేకరిస్తే, అందులో వంద ఎకరాలను ఎవరు మాయం చేశారో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. పేదలు ఇండ్లు కట్టుకునేందుకు వైఎస్సార్ ఇంటి స్థలాలు ఇస్తే, వాటిని లాక్కొకున్నారని ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆ అన్నదమ్ములు రూ.3 లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. 

ఆడవాళ్లకు రక్షణ ఇవ్వలేని సీఎం, మంత్రులు ఉరేసుకోండి

శ్రీనివాస్‌‌గౌడ్‌‌ లిక్కర్ మంత్రి అని, లిక్కర్‌‌‌‌లో తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని షర్మిల అన్నారు. లిక్కర్ అమ్మకాలు పెరగడంతో ఆడవాళ్ల మీద లైగింక దాడులు కూడా పెరిగాయన్నారు. మహిళల మీద జరుగుతున్న దాడుల్లో రాష్ట్రం దక్షిణ భారతంలో నంబర్ వన్‌‌గా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవారికి రక్షణ కల్పించలేని ఈ సీఎం, మంత్రులు ఉరి వేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరులోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా ప్రజలు స్థానిక ఎమ్మెల్యేల అరాచకాల గురించే చెబుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు కాకముందు అప్పుల్లో ఉన్న వాళ్లు.. ఇప్పుడు రూ.వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన మీద ఫిర్యాదు చేసేందుకు ఈ జిల్లా ఎమ్మెల్యేలు అంతా ఒకటయ్యారని, అయితే, జిల్లా సమస్యల కోసం ఎప్పుడైనా కలిశారా అని నిలదీశారు. సీఎం కేసీఆర్‌‌‌‌ను ప్రజలు తెలంగాణ నుంచి వెళ్లగొడుతున్నారని, అందుకే దేశం మీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈసారి కేసీఆర్‌‌‌‌కు ఓటు వేస్తే, మీ భవిష్యత్‌‌ మిమ్మల్ని క్షమించదన్నారు.