సీఎం అభ్యర్థిని ప్రకటించిన అన్నాడీఎంకే

సీఎం అభ్యర్థిని ప్రకటించిన అన్నాడీఎంకే

చెన్నై: తమిళనాడులో ఎన్నికల ఫీవర్ మొదలైంది. వచ్చే ఏడాది మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నప్పటికీ వాటికి సంబంధించిన కసరత్తులను అన్ని పార్టీలు మొదలుపెట్టాయి. విపక్ష డీఎంకేలో స్టాలిన్ లాంటి బలమైన నేత ఉన్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే నుంచి ఎవరు సీఎం అభ్యర్థిగా ఉంటారనే దానిపై ఉత్కంఠ రేగింది. దీనికి సంబంధించి అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభానికి ఎట్టకేలకు ఫుల్‌‌స్టాప్ పడింది. తాజా సీఎం ఎడప్పాడి పళని స్వామిని అన్నాడీఎంకే తమ సీఎంగా అభ్యర్థిని ప్రకటించింది. సీఎం కుర్చీ కోసం పళని స్వామి, పన్నీర్ సెల్వం మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ 11 మంది సభ్యుల స్టీరింగ్ కమిటీ తాజా సీఎం వైపు మొగ్గు చూపింది.

తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణం తర్వాత కొన్నాళ్లు పన్నీర్ సెల్వం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత శశికళ సాయంతో పళని సీఎం సీటు దక్కించుకున్నారు. అప్పటినుంచి పళని సీఎంగా కొనసాగుతుండగా, పార్టీ వ్యవహారాలతో పాటు డిప్యూటీ సీఎం బాధ్యతలను పన్నీర్ సెల్వం నిర్వర్తిస్తున్నారు. మూడున్నరేళ్లు పళని స్వామి సీఎంగా ఉన్నందున ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వం పట్టుబట్టారు. దీంతో పార్టీలో పలు చర్చలు జరిగాయి. మొత్తానికి పళని స్వామిని సీఎం క్యాండిడేట్‌‌గా పన్నీర్ సెల్వం స్వయంగా ప్రకటించారు.