పాల్వంచ ఎర్త్‌‌ సైన్స్‌‌ వర్సిటీ.. దేశంలోనే మొదటిది ..డిసెంబర్ 2న ప్రారంభించనున్న సీఎం రేవంత్‌‌రెడ్డి

పాల్వంచ ఎర్త్‌‌ సైన్స్‌‌ వర్సిటీ..  దేశంలోనే మొదటిది ..డిసెంబర్ 2న  ప్రారంభించనున్న సీఎం రేవంత్‌‌రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : దేశంలోనే తొలి ఎర్త్‌‌ సైన్సెస్‌‌ యూనివర్సిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు కాబోతోంది. ఈ యూనివర్సిటీకి మాజీ ప్రధాని డాక్టర్‌‌ మన్మోహన్‌‌ సింగ్‌‌ పేరును  రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 

అన్ని రకాల సహజ వనరులు, మినరల్స్ ఉన్న భద్రాద్రి జిల్లాలో ఎర్త్ సైన్సెస్‌‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆరు నెలల పాటు ఎక్స్‌‌పర్ట్స్‌‌తో చర్చించి, యూనివర్సిటీ ఏర్పాటుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనువైనదే అని గుర్తించి వర్సిటీని మంజూరుచేశారు. 

వర్సిటీ ఏర్పాటు కోసం 300 ఎకరాలు కేటాయించారు. మంగళవారం సీఎం రేవంత్‌‌రెడ్డి చేతుల మీదుగా యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. యూనివర్శిటీ ప్రారంభం అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. 

అందించనున్న కోర్సులు
ఎర్త్‌‌ సైన్స్‌‌ యూనివర్సిటీలో భూగోళ, ఖగోళ శాస్త్రాలకు సంబంధించి పలు కోర్సులను ప్రారంభించనున్నారు. యూనివర్సిటీలో ప్రస్తుతం ఈఈఈ, మైనింగ్, ఈసీఈ, ఐటీతో పాటు బీఎస్సీ జియాలజీ, ఎన్విరాన్‌‌మెంట్‌‌ సైన్స్ వంటి కోర్సులు కొనసాగుతున్నాయి. భవిష్యత్‌‌లో  యూజీ, పీజీ ప్రోగ్రాంలలో జియాలజీ, ఎన్విరాన్‌‌మెంట్‌‌ సైన్స్‌‌, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీతో పాటు యూజీసీ రూల్స్‌‌ ప్రకారం పీహెచ్‌‌డీ ప్రోగ్రామ్స్‌‌ను సైతం అందించనున్నారు. 

అలాగే మైనింగ్‌‌ ఇంజినీరింగ్‌‌, కంప్యూటర్‌‌ సైన్స్‌‌ అండ్‌‌ ఇంజినీరింగ్‌‌, ఎలక్ట్రికల్‌‌ అండ్‌‌ ఎలక్ట్రానిక్స్‌‌ ఇంజినీరింగ్‌‌, ఎలక్ట్రానిక్‌‌ అండ్‌‌ కమ్యూనికేషన్‌‌ ఇంజినీరింగ్‌‌, ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీలో 60 సీట్ల చొప్పున మొత్తం 780 సీట్లను కేటాయించనున్నారు. అలాగే ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్‌‌ జియాలజీ, ఖనిజశాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి కోర్సులు సైతం అందుబాటులోకి 
రానున్నాయి.