- 6.6 ఫీట్లకు పడిపోయిన నీటి మట్టం
- మరో 5 రోజుల వరకే తాగునీరు
- ఆ మూడు జిల్లాలకు గండం
ఖమ్మం/ కూసుమంచి, వెలుగు: పాలేరు రిజర్వాయర్లో నీటిమట్టం రోజురోజుకూ పడిపోతోంది. వర్షాకాలం వచ్చి 45 రోజులవుతున్నా పెద్దగా వానలు పడకపోవడంతో ఇంతవరకు పాలేరుకు ఇన్ ఫ్లో మొదలు కాలేదు. దీంతో ఎండాకాలం తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి రిలీజ్ చేసిన నీళ్లు అడుగంటుతున్నాయి. సోమవారం నీటిమట్టం 6.6 అడుగులకు పడిపోయింది.
ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు గ్రామాలకు ఇక్కడి నుంచే మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తుండగా, ఇంకో ఐదు రోజుల వరకు మాత్రమే ప్రస్తుతమున్న నీళ్లు సరిపోతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. 6.6 అడుగుల వరకు నీటిమట్టం చూపిస్తున్నప్పటికీ, ఇంకో అడుగున్నర వరకు మాత్రమే నీటిని వాడుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈలోగా వర్షాలు రాకుంటే ఇబ్బందులు తప్పేలా లేవు.