పాలేరులోకి మున్నేరు వరద!..సముద్రంలోకి పోతున్న నీరు గ్రావిటీ కెనాల్ తో మళ్లింపు

పాలేరులోకి మున్నేరు వరద!..సముద్రంలోకి పోతున్న నీరు గ్రావిటీ కెనాల్ తో మళ్లింపు
  • రూ.162.54 కోట్లతో 9.6 కిలోమీటర్ల కాల్వ నిర్మాణం ​
  • పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం
  • దాదాపు 200 ఎకరాల భూసేకరణ అంచనా 

ఖమ్మం, వెలుగు : పాలేరు రిజర్వాయర్​ కు నాగార్జున సాగర్​ నీటితో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్ ఇచ్చింది. మున్నేరు వరద నీటిని పాలేరు రిజర్వాయర్ కు మళ్లించే లింక్​ కెనాల్​ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రూ.162.54 కోట్లతో 9.650 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నిర్మించేందుకు అనుమతులిస్తూ జీవో 98 ను విడుదల చేసింది. ప్రతియేటా మున్నేరు నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిలో కనీసం 10 టీఎంసీలను సాగర్​ ఆయకట్టుకు ఉపయోగించుకునేలా జిల్లా ఇరిగేషన్ అధికారులు ఈ ప్లాన్​ చేశారు.

 ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న పాలేరు లింక్​ కాల్వకు, 9.6 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ తవ్వడం ద్వారా మున్నేరు వరద నీటిని పాలేరు రిజర్వాయర్​ కు మళ్లించనున్నారు. దీని ద్వారా నాగార్జున సాగర్​ ప్రాజెక్టు ద్వారా వచ్చే కృష్ణా 
నీటిపై ఆధారపడకుండానే ఖమ్మం జిల్లాలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోనే 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. దీంతో పాటు వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు సాగు నీరు అందించనున్నారు. సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు తాగునీరు,  డోర్నకల్ నియోజకవర్గం పరిధిలో పది చెరువులకు సాగునీరు అందనుంది.    

30 టీఎంసీలకుపైగా సముద్రంలో కలుస్తున్న వరద నీరు

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా మీదుగా వచ్చే మున్నేరు నది ఖమ్మం నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తూ ఉంటుంది. మార్గమధ్యలో మున్నేరులో ఆకేరు, బిక్కేరు కలుస్తుండగా, ప్రతియేటా మున్నేరు ద్వారా 30 నుంచి 40  టీఎంసీల వరద నీరు సముద్రంలో కలుస్తుంది. ప్రస్తుతం సీతారామ కాల్వల నిర్మాణం ఆలస్యం అవుతుండడంతో పాటు, ప్రతిసారి ఎత్తిపోతలకు విద్యుత్​ ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా మున్నేరు నీటిని పాలేరు రిజర్వాయర్​ కు తరలించేలా ఈ కాల్వ ప్లాన్​ చేశారు. ఈ గ్రావిటీ కాల్వ నిర్మాణానికి దాదాపు రూ.130 కోట్లు ఖర్చు అవుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందుకు 200 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉండగా, ల్యాండ్ అక్విజేషన్​ కు రూ.30 కోట్లు ఖర్చవుతాయని లెక్కేశారు. 

మొత్తం రూ.162.54 కోట్ల అంచనా వ్యయంతో 9.6 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వ తవ్వడం ద్వారా మున్నేరు నీటిని ప్రస్తుతం నిర్మాణమవుతున్న పాలేరు ట్రంక్​ కెనాల్​కు తరలించేలా ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. దీన్ని గతేడాది ఆగస్టు 15న వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అదే బహిరంగ సభలో కొరివి వీరన్న పేరుతో రిజర్వాయర్​ ను కూడా ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. ప్రస్తుతానికి రిజర్వాయర్​ పై నిర్ణయం ఇంకా పెండింగ్ లో ఉండగా, గ్రావిటీ కెనాల్ నిర్మాణానికి గ్రీన్​ సిగ్నల్ వచ్చింది. 

మహబూబాబాద్​ జిల్లా గార్ల మండలం దుబ్బగూడెం దగ్గర మున్నేరుపై చెక్​ డ్యామ్​ ఉంది. అక్కడి నుంచి 9.6 కిలోమీటర్ల దూరంలోని పాలేరు లింక్​ కెనాల్​ బెడ్​ 
లెవల్​ నాలుగు మీటర్ల దిగువన ఉంది. దీంతో గ్రావిటీ ద్వారానే పాలేరు కాల్వలోకి మున్నేరు నీటిని తరలించొచ్చు. ప్రభుత్వం నుంచి తాజాగా పరిపాలన అనుమతులు రావడంతో టెండర్లు పూర్తి చేసుకొని, పనులు ప్రారంభిస్తే ఏడాదిన్నర లోగానే ఆ కాల్వ ద్వారా పాలేరు రిజర్వాయర్ కు నీటిని తరలించే అవకాశముందని అధికారులు 
చెబుతున్నారు. 

గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేస్తాం

ప్రతియేటా వర్షాకాలంలో వస్తున్న వరద నీటిని ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మున్నేరు నుంచి పాలేరుకు లింక్ కెనాల్ ను మంజూరు చేయించుకున్నాం. నిర్దేశించిన గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వృథాగా పోతున్న వరద నీటిలో 120 నుంచి 150 రోజుల్లో సుమారు 10 టీఎంసీలను పాలేరు రిజర్వాయర్ కు మళ్లించవచ్చు. దీనివల్ల రిజర్వాయర్ పరిధిలో  2.54 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుండగా, ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. పాలేరు లింక్ కెనాల్ కు అనుమతులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.– పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి