కూతురైన, బంధువువైనా సరే.. పార్టీ శ్రేయస్సే కేసీఆర్‎కు ముఖ్యం: కవిత సస్పెన్షన్‎పై పల్లా రియాక్షన్

కూతురైన, బంధువువైనా సరే.. పార్టీ శ్రేయస్సే కేసీఆర్‎కు ముఖ్యం: కవిత సస్పెన్షన్‎పై పల్లా రియాక్షన్

హైదరాబాద్: పార్టీ కార్యకర్తల నిర్ణయం మేరకే ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన చర్యలు తప్పవని.. కూతురైన, బంధువువైనా సరే.. పార్టీ శ్రేయస్సే కేసీఆర్‎కు ముఖ్యమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‎పై పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు వీ6 ప్రతినిధితో మాట్లాడుతూ.. కవిత కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడి బీఆర్ఎస్ సీనియర్ నాయకులపై బాధ్యత రహితమైన ప్రకటనలు చేయడం దురదృష్టకరమన్నారు.

 ప్రాంతీయ పార్టీలలో కుటుంబ కలహాలు సృష్టించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటని విమర్శించారు. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలలో చిచ్చు పెట్టడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. 60 లక్షల పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతినకుండా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు పల్లా. 

గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు మంగళవారం (సెప్టెంబర్ 2) ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, పార్టీ కీలక నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.