రెండు పార్టీలు రూ.500 కోట్లు ఖర్చు పెట్టాయి : పాల్వాయి స్రవంతి 

రెండు పార్టీలు రూ.500 కోట్లు ఖర్చు పెట్టాయి : పాల్వాయి స్రవంతి 
  • ఇట్లాగైతే యువత పాలిటిక్స్​లోకి ఎలా వస్తారు? 
  • వెంకట్​రెడ్డి సంగతి హైకమాండ్​ చూసుకుంటది

చండూరు, వెలుగు : మునుగోడు ఉప ఎన్నిక పరిణామాలు చూశాక రాజకీయాలు చేయాలంటేనే భయమేస్తుందని కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆవేదన వ్యక్తంచేశారు. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ ​ధన బలం, అంగబలంతో ప్రజలను భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని ఆరోపించారు. సోమవారం చండూరు మండలం ఇడికుడలోని ఆమె ఇంట్లో మీడియాతో మాట్లాడారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యవహరించి, ఓటర్లను ప్రలోభాలకు, భయాందోళనకు గురిచేయడం ఆవేదన కలిగించిందన్నారు. అధికారం, అహంకారంతో రూ.500 కోట్లు ఖర్చు చేశారన్నారు.  యువత సమాజానికి సేవ చేయాలని, మార్పు తీసుకురావాలని రాజకీయాల్లోకి రావాలని చూస్తుంటే..కొన్ని పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ, మద్యం ఏరులై పారిస్తూ రాజకీయాలు అవసరం లేదనే భావన కలిగిస్తున్నారన్నారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసినట్టు రాత్రికి రాత్రి ఫొటోలు సృష్టించి సోషల్ మీడియాలో పెట్టి అసత్య ప్రచారాలు చేశారని, ఇలాంటి అనైతికమైన రాజకీయాన్ని దేశంలోఎక్కడా చూడలేదన్నారు. ఈ ఎన్నిక ప్రజల కోసం జరిగింది కాదని, డబ్బుల కోసమే జరిగిన ఎన్నిక అని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ రోజు తప్ప ఎక్కడా కనిపించలేదన్నారు. ఏ గ్రామంలో గెలిపించాలని ప్రజల వద్దకు వెళ్లని అభ్యర్థి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలు ఆలోచించాలన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్ట్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాయన్నారు. తమ ఓటు బ్యాంక్​ బీజేపీ వైపు టర్న్ అయ్యిందన్నారు. వెంకట్​రెడ్డిపై హైకమాండ్ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజా సమస్యలపై జనాల మధ్య ఉండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత  పాల్గొన్నారు.