ప్రగతి భవన్‌ వద్ద ధర్నా చేద్దాం రా.. కవితకు కాంగ్రెస్ నేత స్రవంతి సవాల్‌

ప్రగతి భవన్‌ వద్ద ధర్నా చేద్దాం రా.. కవితకు కాంగ్రెస్ నేత స్రవంతి సవాల్‌

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్ అభ్యర్థుల లిస్టులో కొన్ని వర్గాలకు రిప్రెజెంటేషన్ సరిగ్గా లేదని పీసీసీ అధికార ప్రతినిధి పాల్వాయి స్రవంతి అన్నారు. లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకు మహిళా రిజర్వేషన్ కార్డును కల్వకుంట్ల కవిత వాడుకున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లి ధర్నాలు, సభలు నిర్వహించారని గుర్తుచేశారు. కానీ, బీఆర్‌‌ఎస్ అభ్యర్థుల లిస్టులో మాత్రం ఏడుగురు మహిళలకే సీట్లిచ్చినా కవిత మాట్లాడం లేదని విమర్శించారు. 

మహిళలపై కేసీఆర్ చూపించిన వివక్షపై పోరాడేందుకు కవిత సిద్ధమా అని సవాల్‌​విసిరారు. ఈ విషయంలో ‘ప్రగతి భవన్ వద్ద ధర్నా చేద్దాం రా..’అంటూ డిమాండ్‌ చేశారు. బీఆర్‌‌ఎస్ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే గిరిజన మహిళపై పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేశారన్నారు.