ODI World Cup 2023: ఆడింది చాలు వచ్చేయండి.. మనం ఆడుకుందాం: పాక్ ఆటగాళ్లకు ఐస్‌ల్యాండ్ క్రికెట్ విజ్ఞప్తి

ODI World Cup 2023: ఆడింది చాలు వచ్చేయండి.. మనం ఆడుకుందాం: పాక్ ఆటగాళ్లకు ఐస్‌ల్యాండ్ క్రికెట్ విజ్ఞప్తి

టైటిల్ ఫేవరెట్‌గా టోర్నీలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. మొదట రెండు విజయాలతో టోర్నీని ఘనంగా ఆరంభించినా.. ఆ తర్వాత అదే ఊపు కొనసాగించలేపోయింది. వరుస ఓటములతో ఘోర అవమానాలు ఎదుర్కుంటోంది. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా నాలుగింట ఓడి సెమీస్ రేసు నుంచి అనధికారికంగా తప్పుకుంది. ఈ చులకన భావమో.. ఏమో కానీ, ఐస్‌ల్యాండ్ క్రికెట్ పాక్ ఆటగాళ్లను కించపరిచేలా పోస్ట్ పెట్టింది. 

తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ పై విజయం సాధించిన పాకిస్తాన్, రెండో మ్యాచ్‌లో శ్రీలంకను మట్టి కరిపించింది. అంతే.. అక్కడినుండి వారి ప్రదర్శన దిగజారిపోయింది. ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా చేతిలో వరుస పరాజయాలు. ఈ టోర్నీలో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండడంతో భారత గడ్డపై ఉంటోంది కానీ, లేదంటే ఈపాటికే ఇంటికి పయనమయ్యేది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లకు, ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు ఐస్‌ల్యాండ్ క్రికెట్ సోషల్ మీడియా వేదికగా ఒక విజ్ఞప్తి చేసింది. ఇక ఆడింది చాలు వచ్చేయండి.. మనం మనం ఆడుకుందాం.. అని అర్థం వచ్చేలా కించపరుస్తూ ట్వీట్ చేసింది. 

"1992 ప్రపంచ కప్ విజేతలారా! ఈ సిల్లీ గ్లోబల్ టోర్నమెంట్‌ను ఇక విడిచిపెట్టి మాతో ట్రై-సిరీస్ ఆడండి. తద్వారా ఆటలో పురోగతి సాధించడమే కాదు.. గణాంకాలు తిరిగి పొందవచ్చు.." అని ఐస్‌ల్యాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటలో గెలుపోటములు సహజం.. ఒక పెద్ద జట్టును ఇలా కించపరచడం సరికాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పాకిస్తాన్ తదుపరి మ్యాచ్‌లు

  • అక్టోబర్ 31న బంగ్లాదేశ్‌తో(కోల్‌కతా),
  • నవంబర్ 4న న్యూజిల్యాండ్‌తో(బెంగళూరు),
  • నవంబర్ 11న ఇంగ్లాండ్‌తో(కోల్‌కతా)