
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా సినిమా ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్. విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మించిన ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న విడుదలవుతోంది. శుక్రవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘విశ్వక్ ఈవెంట్‌కు రావడం నా బాధ్యత. అతనొక ఎనర్జీ బాల్. తన ఫస్ట్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’లో నటన నాకెంతో ఇష్టం. నటుడిగా ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటాడో అంతే కాన్ఫిడెంట్‌గా ‘ఫలక్‌నుమా దాస్’ని డైరెక్ట్ చేశాడు.
ఇమేజ్ చట్రంలో పడుతున్నాడనుకున్న టైమ్‌లో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చూసి మళ్లీ షాక్ అయ్యాను. అంతలా పరిణితి చెందాడా అనిపించింది. ‘హిట్’లో చాలా బ్యాలెన్సుడ్‌గా నటించాడు. తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్న నటుడు విశ్వక్. సినిమా పట్ల విశ్వక్‌కి పిచ్చి. అందుకే ‘దాస్ కా ధమ్కీ’ బ్లాక్ బస్టర్ అవ్వాలి. తెలుగు వాళ్ల పండుగైన ఉగాదికి ఈ సినిమా వస్తోంది. విశ్వక్‌కు ఈ చిత్రంతో నిజమైన పండుగ రావాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా తర్వాత విశ్వక్ డైరెక్షన్ ఆపేయాలి. ఎందుకంటే చాలామంది కొత్త దర్శకులకు అతను అవకాశాలు ఇవ్వాలి. తెలుగు సినిమా ఇప్పుడు ఆల్ టైమ్ టాప్‌లో ఉంది. సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి కట్టుగా ముందుకెళ్లాలి. తెలుగు చలనచిత్ర సీమను ప్రపంచపటంలో నిలబెట్టాలి’ అన్నాడు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ అన్న ఈవెంట్‌కి రావడం ఫ్యాన్ బాయ్‌గా చాలా ఆనందంగా ఉంది.
‘ఫలక్‌నుమా దాస్’ తర్వాత మళ్లీ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. యాక్టింగ్ ఒక్కటే చేసుంటే మూడు సినిమాల్లో నటించేవాడ్ని. ఫస్టాఫ్‌లో కామెడీ, ఫైట్స్, రొమాన్స్ అన్నీ ఉంటాయి. సెకెండాఫ్‌లో మాత్రం ప్రేక్షకుల గుండె బరువెక్కుతుంది. చివరి రెండు నిమిషాల్లో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. ఇందులో విశ్వక్ సేన్ 2.0ను చూస్తారు’ అని చెప్పాడు. ‘ఎన్టీఆర్ రాకతో ‘ధమ్కీ’ బ్లాక్ బస్టర్ స్టార్ట్ అయ్యింది’ అంది నివేదా పేతురాజ్. నిర్మాత కరాటే రాజు, హైపర్ ఆది, రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్, లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్, పూర్ణాచారి పాల్గొన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆస్కార్ రావడానికి రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో.. యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ, యావత్ భారతదేశ ప్రేక్షకులు అంతే కారణం. ఆ అవార్డు సాధించింది మీరంతా. మీరందరి బదులు మేము అక్కడికి వెళ్లాం. ఆస్కార్ స్టేజ్‌పై కీరవాణి, చంద్రబోస్ గారు ఉన్నప్పుడు.. ఇద్దరు తెలుగు వాళ్లు నాకు కనిపించారు. ఆ స్టేజ్ మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది. ఆ మూమెంట్ ఇంకెప్పుడు పొందుతామో తెలీదు. భారత చిత్రాలు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నా
– ఎన్టీఆర్