
న్యూఢిల్లీ: ఈ బడ్జెట్లో సామాన్యుల నుంచి వ్యాపార సంస్థల దాకా అందరికీ మేలు చేసే ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) ను సింగిల్ బిజినెస్ ఐడీగా చట్టబద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం వ్యాపారాలకు వివిధ రకాల అనుమతులు ఇచ్చేందుకు 20కిపైగా వివిధ రకాల కార్డులను ఐడీలుగా అడుగుతున్నారు. తాజా సంస్కరణతో ఇకపై పాన్ కార్డు ఒక్కదాన్నే ఐడీగా సమర్పిస్తే సరిపోతుంది. దీంతో వ్యాపార సంస్థలకు అనుమతుల ప్రక్రియ మరింత సులభతరం కానుంది. వివిధ రంగాల్లో అనుమతులు, క్లియరెన్స్‌ల కోసం జాతీయ స్థాయిలో సింగిల్ విండో వ్యవస్థను తెచ్చే దిశగా ఇది కీలక అడుగని ఆర్థికమంత్రి అన్నారు.
ప్రస్తుతం వ్యాపార సంస్థలు ఈపీఎఫ్ వో, ఈఎస్ఐసీ, జీఎస్టీఎన్, టీఐఎన్, టీఏఎన్, పాన్ వంటి దాదాపు 20 రకాల ఐడీ కార్డులను చూపించి అవసరమైన పర్మిషన్స్ తెచ్చుకుంటున్నాయి. వ్యాపారాలు పెట్టినప్పుడల్లా ఈ కార్డులు అన్నింటి కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ఆయా వ్యక్తులు, పెట్టుబడిదారులకు విలువైన సమయం వృథా అవుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ 2023 ఫైనాన్స్ యాక్ట్ కింద ఒక్క పాన్ కార్డు నంబరుతోనే చట్టబద్ధత పొందేలా సంస్కరణను తీసుకొచ్చారు. పాన్ కార్డు అనేది కేంద్ర ఆదాయ పన్నుశాఖ జారీ చేసే 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్ సంఖ్య.