V6 News

ఓటేస్తానని ఒట్టెయ్! పిల్లలు, దేవుళ్ల మీద ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు

ఓటేస్తానని ఒట్టెయ్! పిల్లలు, దేవుళ్ల మీద ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు
  • కడుపుల తలకాయపెడ్తూ, కాళ్లు మొక్కుతూ అభ్యర్థన 
  • రాత్రిపూట జోరుగా మటన్, చికెన్, లిక్కర్‌‌‌‌తో దావత్‌‌లు
  • వలస ఓటర్లకు వీడియో కాల్స్.. ఓటేసిపోవాలని వేడుకోలు
  • నేటితో (డిసెంబర్ 09) ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం
  • పోలింగ్‌‌కు మిగిలింది రెండు రోజులే

హైదరాబాద్/ఆదిలాబాద్, వెలుగు:   మొదటి విడత పంచాయతీ పల్లె పోరు  క్లైమాక్స్‌‌కు చేరింది. ప్రచారానికి మంగళవారం (డిసెంబర్ 09) సాయంత్రం ఫుల్‌‌స్టాప్​ పడనుండడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. రాత్రిపూట సైలెంట్‌‌గా ఇంటింటికీ వెళ్తూ నోట్లు పంచుతున్నారు. ఒట్లు వేయించుకుంటున్నారు. కొన్నిచోట్లయితే  లిక్కర్, చికెన్, మటన్‌‌​ పంపిణీ చేస్తున్నారు.  

పైసలు చేతిలో పెట్టాక తమకే ఓటు వేయాలని ఒట్టు వేయించుకుంటున్నారు.  ప్రత్యర్థి కూడా డబ్బులు పంచుతుండడంతో  పిల్లలు, దేవుండ్ల మీద ప్రమాణాలు చేయించుకుంటున్నారు. వలస ఓటర్లకు వీడియో కాల్స్ చేసి.. తమకు ఓటేసిపోవాలని వేడుకుంటున్నారు.

గెలుపుకోసం పాట్లు..

తొలి విడత ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగుస్తుండడం.. 11న ఎన్నికలు జరుగనుండడంతో గెలుపుకోసం అభ్యర్థులు  సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు సెంటిమెంట్‌నే నమ్ముకున్నారు. ఈగోలను పక్కనపెట్టేసి  వయసులో చిన్నోడా, పెద్దోడా అని తేడాలేకుండా కాళ్ల మీద పడిపోతున్నారు. అవసరమైతే సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. 

ఇంకొందరైతే మరీ విచిత్రంగా ఓటర్లను హత్తుకొని.. ‘నువ్వే దిక్కు.. నన్ను గట్టెక్కించు’ అంటూ  కడుపులో తలకాయ పెట్టి మరీ బతిమిలాడుతున్నారు.  ‘నీ కాళ్లు మొక్కుతా నాకు ఓటెయ్.. ఎప్పుడు నువ్వు చెప్పినట్లే ఉంటా.. ఏం చెప్పినా చేస్తా’ అంటూ అభ్యర్థిస్తున్నారు. ఆడబిడ్డలకైతే పసుపు కుంకుమలిచ్చి..  ఎమోషనల్ టచ్ ఇస్తున్నారు. అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచే ప్రచారానికి బయల్దేరుతున్నారు.  ఓటర్లు పొలంబాట పట్టకముందే.. వారిండ్ల ముందు వాలిపోతున్నారు.  తమకు కేటాయించిన గుర్తులను చేతిలో పట్టుకొని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 

నైట్​ క్యాంపెయిన్​కీలకం 

పగలు మైకుల మోత ముగియగానే రాత్రి 8, 9 గంటల తర్వాత అసలు రాజకీయం మొదలుపెడ్తున్నారు. కుల సంఘాల పెద్దలతో సీక్రెట్ మంతనాలు జరుపుతూ, తాయిలాల పంపిణీకి స్కెచ్ వేస్తున్నారు. ఇటు  పోలీసులు, అటు ఎలక్షన్ ఆఫీసర్లకు దొరక్కుండా ఓటర్ల ఇండ్లకు వెళ్లి డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. అధికారులు, పోలీసులు, ప్రత్యర్థుల నిఘా ఉన్నచోట్ల  ఓటర్ల చేతికి నేరుగా డబ్బులు ఇవ్వకుండా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు.  గ్రామస్థాయి ఏజెంట్ల ద్వారా ఓటర్ల లిస్ట్ తయారు చేసి.. వారి ఫోన్ నంబర్లకు అమౌంట్ పంపిస్తున్నారు. కొన్నిచోట్ల కిరాణా దుకాణాలు, మద్యం షాపులు, పెట్రోల్ బంకుల్లో చెల్లుబాటయ్యేలా స్లిప్పులు పంచుతున్నారు.  ఎన్నికలయ్యాక పేమెంట్ సెటిల్ చేసేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు.  అటు హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిన వారికి  ఫోన్లు చేసి, వచ్చి ఓటేసి పోవాలని బతిమిలాడుతున్నారు. బస్సు చార్జీలతోపాటు ఓటుకు ఇంత చొప్పున ఆన్​లైన్​లో పంపిస్తున్నారు. 

ఒకరిపై ఒకరు నిఘా 

పోలింగ్‌కు రెండు రోజుల ముందు చేసే క్యాంపెయిన్​కీలకం కావడంతో గ్రామాలన్నీ నిఘా నీడలోకి వెళ్లాయి. పోలీసులు బలగాలు మోహరించకపోయినా.. అభ్యర్థులు, ప్రత్యర్థులే ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకుంటున్నారు. ఏ అభ్యర్థి మనుషులు ఏ ఇంట్లోకి వెళ్తున్నారు? ఎవరికి ఎంత ముట్టజెప్పుతున్నారు? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. ‘వాళ్లు వెయ్యిస్తే.. మనం 2 వేలు ఇద్దాం’ అంటూ పోటాపోటీగా పంచుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి డబ్బు పంచుతుంటే వీడియోలు తీసి,  పోలీసులకు సమాచారం చేరవేసేందుకు కాచుకొని కూర్చున్నారు. అదే సమయంలోకొత్తగా ఊళ్లోకి వచ్చినవారిపై, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.