క్లస్టర్లో నామినేషన్లు.. మూడు, నాలుగు పంచాయతీలను కలిపి ఓ క్లస్టర్

క్లస్టర్లో నామినేషన్లు.. మూడు, నాలుగు పంచాయతీలను కలిపి ఓ క్లస్టర్
  • నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
  • అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
  • ఫస్ట్ ఫేజ్ లో ఉమ్మడి జిల్లాలో 506 జీపీలు, 4,222 వార్డులకు ఎన్నికలు

ఆసిఫాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో తొలి అంకం మొదలైంది. మొదటి విడత పంచాయతీల్లో భాగంగా నేటి నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం అభ్యర్థులు గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని సిద్ధం చేశారు. మూడు నుంచి నాలుగు పంచాయతీలను కలిపి ఓ క్లస్టర్ గా ఏర్పాటు చేసి.. ఆ క్లస్టర్ కేంద్రంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

మూడు విడతల్లో ఆయా మండలాల వారీగా నామినేషన్లు ఆ క్లస్టర్​లోనే తీసుకోనున్నారు. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్‌, సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లకు అందజేయాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 506 గ్రామ పంచాయతీలు, 4,222 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. ఆసిఫాబాద్ లోని ఆయా పంచాయతీలను 87 క్లస్టర్లుగా విభజించారు.

ఉదయం 10.30 గంటల నుంచి..

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు గురువారం నుంచి స్వీకరించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 29న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ముగుస్తుంది. 30న నామినేషన్ల పరిశీలన, వచ్చే నెల 1న అభ్యంతరాల స్వీకరణ, 2న అభ్యంతరాల పరిశీలన, డిస్ పోజల్, 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. అనంతరం పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్, 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పూర్తికాగానే ఫలితాలు ప్రకటించనున్నారు.

విద్యార్హత నిబంధన లేదు

ఈ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లకు పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి విద్యార్హత నిబంధనలేదు. దీంతో అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువగానే ఉండే అవకాశముంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈవీఎంలు మొరాయింపు సమస్య ఉండవు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ లో నోటా చేర్చారు. అంటే నిలబడ్డ వారిలో ఎవరూ కూడా నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈమేరకు బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధమయ్యాయి.

అభ్యర్థులకు కావాల్సినవి...

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. సంబంధిత గ్రామ పంచాయతీలో తప్పనిసరిగా ఓటరై ఉండాలి. పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపాదించే వారు సైతం సంబంధిత గ్రామ పంచాయతీ, వార్డు పరిధిలో ఓటరై ఉండాలి. అభ్యర్థులు సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి. కొత్తగా బ్యాంక్  అకౌంట్ ఖాతా (జీరో అకౌంట్) తెరచి నామినేషన్ ఫారంతో జిరాక్స్ ను రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది.

మొదటి విడత  జిల్లాల వారీగా పంచాయతీలు, ఏర్పాటు చేసిన క్లస్టర్లు

జిల్లా    జీపీలు    వార్డులు    క్లస్టర్లు

ఆసిఫాబాద్    114    944    27

ఆదిలాబాద్    166    1390    31

మంచిర్యాల    90    816    

నిర్మల్    136               1072             36