కుటుంబాల్లో కుంపట్లు.. పంచాయతీ ఎన్నికల బరిలోకి కుటుంబసభ్యులు, బంధువులు

కుటుంబాల్లో కుంపట్లు.. పంచాయతీ ఎన్నికల బరిలోకి కుటుంబసభ్యులు, బంధువులు
  • రిజర్వేషన్లు అనుకూలించడంతో పోటీకి సై
  • విత్ డ్రాల కోసం మొదలైన బుజ్జగింపులు
  • ససేమిరా అంటున్న పోటీదారులు

ఆదిలాబాద్, వెలుగు:  పంచాయతీ ఎన్నికలు పల్లె కుటుంబాల్లో కుంపట్లు పెడుతున్నయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత నామినేషన్లు ప్రారంభం కాగా.. మొదటి విడతలో వేసిన నామినేషన్లలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఈసారి రొటేషన్ పద్ధతిలో రిజర్వేష్లన్లు ఖరారు చేయడంతో చాలా మంది ఆశావహులకు అనుకూలంగా మారింది. రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో.. అందిన అవకాశాన్ని వదులుకోవద్దని పలువురు నామినేషన్లు వేస్తున్నారు. 

కొన్ని చోట్ల ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురు నామినేషన్ల వేస్తూ పరాయి వ్యక్తుల్లా, పోటీదారుల్లా మారుతు న్నారు. అన్నదమ్ములు.. తండ్రీకొడుకులు.. బావబామ్మర్దులు.. ఇలా చాలా మంది పోటీలో నిలబడుతున్నారు. ముందునుంచీ రాజకీయాల్లో కొనసాగుతున్నవారే కాకుండా హఠాత్తుగా కొత్తవారు ముందుకొస్తున్నారు. 

అన్నదమ్ములు, అత్తాకోడళ్లు..

ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంట గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు జాదవ్ కుబేర్ సింగ్, లఖన్, అనార్ సింగ్ సర్పంచ్ స్థానానికి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. లఖన్ గత ఎన్నికల్లో సర్పంచ్ గా పనిచేశారు. తాజాగా మరోసారి బరిలో నిలిచారు. అయితే ఈ సారి తాము కూడా పోటీ చేస్తామంటూ ఆయన అన్నదమ్ములిద్దరు నామినేషన్ వేశారు. హీరాపూర్ గ్రామానికి చెందిన తొడసం లక్ష్మీబాయి, ఆమె కోడలు తొడసం మహేశ్వరి సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. 

దీంతో అత్త కోడళ్ల మధ్య పోటీ నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో ఆదిలాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రాణ స్నేహితులుగా ఉన్న చాలా మంది ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు. ఇలా పంచాయతీ ఎన్నికలు కుటుంబాలు, బంధువుల మధ్య విరోధం ఏర్పడింది.

బుజ్జగింపులు.. అయినా తగ్గేదేలే..

కుటుంబ సభ్యులు, బంధువులు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో వారిని బుజ్జగించేందుకు కుటుంబ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇలాంటి అవకాశం మళ్లీ రాదంటూ అభ్యర్థులు పోటీకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకరికి సపోర్ట్​చేసే మరొకరితో విభేదాలు వస్తాయని, దీంతో ఎవరి వైపు ఉండాలో తెలియక బంధువులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఇలాంటి పంచాయతీలు పార్టీల పెద్దల వరకూ వెళ్తున్నాయి. 

తమకు పార్టీ మద్దతు ఇవ్వాలని అభ్యర్థులు వెళ్తుండగా.. నామినేషన్లు వేసిన తోటి కుటుంబసభ్యులను పిలిపించి వారు సముదాయిస్తున్నారు. నామినేషన్లు విత్ డ్రా చేయించేలా రాజీ కుదురుస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే వారు మాత్రం తాము బరిలో ఉంటామని బాహాటంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడతలో ఆదిలాబాద్ రూరల్, మావల, తాంసి, భీంపూర్, జైనథ్, బేల, సాత్నాల, బోరజ్ మండలాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. చాలా చోట్ల రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో ఆయా పార్టీలు ఇండిపెండెంట్లుగా వేసిన​అభ్యర్లులను పిలిపించుకొని కండువాలు కప్పేస్తున్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు నామినేషన్లు వేస్తే వారు చెరో పార్టీని వెతుక్కుంటున్నారు.

కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తా..

జిల్లాలోని చాలా గ్రామాల్లో రిజర్వేషన్ల అనుకూలతతో నామినేషన్లు వేసిన అభ్యర్థులను విత్ డ్రా చేయించేందుకు తోటి అభ్యర్థులు బేరసారాలు చేస్తున్నారు. తాను గెలుస్తాననే నమ్మకంతో ఉండే అభ్యర్థులు ఎదుటి వారితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. 

గెలిచిన తర్వాత గ్రామాల్లో కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తానని కొందరు చెబుతుండగా.. మరికొందరు గుడ్ విల్ ఆశ చూపుతూ నామినేషన్ వెనక్కి తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ.. మొదటి నుంచి పోటీ చేసే ఆలోచన లేని అభ్యర్థులు సైతం హఠాత్తుగా బరిలో నిలువడం పట్ల అంతా విస్తుపోతున్నారు.