అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడొద్దు..సర్పంచ్ లు పన్జేయకపోతే సస్పెన్షనే

అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడొద్దు..సర్పంచ్ లు పన్జేయకపోతే సస్పెన్షనే

నారాయణపేట టౌన్, వెలుగు: పట్టణాల లెక్కనే పల్లెలు డెవలప్ కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకాంక్షించారు. అందుకోసమే ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్​చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. సర్పంచ్ పన్జేయకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని, సస్పెండ్ చేసే అధికారాలు కలెక్టర్ కు ఉన్నాయని హెచ్చరించారు. ఎవరైనా సర్పంచ్ లు సస్పెండ్ అయితే, అందులో తమ జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన నారాయణపేట జిల్లా పంచాయతీరాజ్​సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పల్లె ప్రగతి నిరంతరాయంగా కొనసాగాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలుంటే సర్పంచ్​లదే బాధ్యతని చెప్పారు. పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. మంచిగ పనిచేసే గ్రామాలకు అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేస్తామని, ప్రజలకు కావాల్సిన మొక్కలను అందులో పెంచాలని సూచించారు.

కమీషన్లకు ఆశ పడొద్దు…

మంత్రి శ్రీనివాస్​గౌడ్​మాట్లాడుతూ… ప్రజలకు కరెప్షన్​ఫ్రీ పాలన అందించాలన్నారు. అధికారులెవరూ కమీషన్లకు ఆశ పడొద్దన్నారు. వచ్చే ఎన్నికల లోపు పాలమూరు–రంగారెడ్డి పథకం ద్వారా నారాయణపేట నియోజకవర్గానికి సాగునీరు రాకపోతే… తాను ఎన్నికల్లో పోటీ చేయనని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్​.రాజేందర్​రెడ్డి సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్​ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి, కొడంగల్​ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి, కలెక్టర్​ హరిచందన దాసరి, జడ్పీ చైర్​పర్సన్​వనజమ్మ తదితరులు పాల్గొన్నారు.