- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఏటూరునాగారం, వెలుగు: ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బూటారం ప్రజల వరద కష్టాలు తీర్చడానికి కరకట్ట నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఏటూరునాగారం మండలం బూటారం వద్ద జంపన్న వాగుపై రూ.1.95 కోట్లతో 500 మీటర్ల పొడవు నిర్మించనున్న కరకట్ట పనులకు శుక్రవారం కలెక్టర్ దివాకర, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఏటా వానాకాలంలో భారీ వరదలు వచ్చినప్పుడు జంపన్న వాగు ఉధృతంగా ప్రవహించి బూటారం గ్రామం ముంపునకు గురయ్యేదని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కరకట్ట పనులు ప్రారంభించామన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.
బాలికల జూనియర్ కళాశాల ప్రారంభం
తాడ్వాయి/ములుగు: తాడ్వాయి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల జూనియర్ కళాశాలతోపాటు మేడారం వెళ్లే జంక్షన్ లో నిర్మించిన ఆదివాసీల నృత్యాలకు సంబంధించిన బొమ్మలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆదివాసీల జీవనశైలికి అద్దం పట్టేలా ఉన్న బొమ్మలను చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయారు. కలెక్టర్ దివాకర, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ లచ్చు పటేల్, కామారం సర్పంచ్ సావిత్రి ఉన్నారు.
మేడారం దేవాలయ పనులు త్వరగా పూర్తవ్వాలి
తాడ్వాయి: మేడారం దేవాలయ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, గద్దెల పునరుద్ధణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం రాత్రి మేడారంలో వనదేవతలను దర్శించుకున్నారు.
