ఏటూరునాగారంను మున్సిపాలిటీ చేస్తం : మంత్రి సీతక్క

ఏటూరునాగారంను మున్సిపాలిటీ చేస్తం : మంత్రి సీతక్క

ఏటూరునాగారం/తాడ్వాయి, వెలుగు: రానున్న రోజుల్లో ఏటూరునాగారంను మున్సిపాలిటీగా మారుస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. శనివారం ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో ఆమె పర్యటించారు. ఏటూరునాగారంలో రూ.కోటి నిధులతో వెజ్, నాన్​ వెజ్​ మార్కెట్​ నిర్మాణ పనులకు కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ చైర్మన్ రేగ కల్యాణితో కలిసి శంకుస్థాపన చేశారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ ద్వారానే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. పల్లెటూరుగా ఉండే ఏటూరునాగారం ఇప్పుడు రెవెన్యూ డివిజన్ గా, రెండు రాష్ట్రాల సరిహద్దుగా విలసిల్లుతోందన్నారు. ఇక్కడ రూ.7.5 కోట్లతో బస్​ డిపో నిర్మాణం జరుగుతోందన్నారు.

గొత్తకోయ హాబిటేషన్లలో సోలార్​ వెలుగులు..

తాడ్వాయి మండలంలోని కొండపర్తి క్రాస్ చెన్నాపురం తోగు, లవ్వాల స్టేజీ జలగలంచ వద్ద నిర్మించిన రెండు ప్రైమరీ స్కూల్​ భవనాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. గూడేల్లో సోలార్​ విద్యుత్​ అందించేందుకు కసరత్తు చేస్తున్నామని, ఇందుకోసం 53 గొత్తికోయ హాబిటేషన్లలో సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ ఈఈ అజయ్​కుమార్​, డీపీవో దేవరాజ్  పాల్గొన్నారు. 

కాగా, తాడ్వాయి మండల పరిధిలోని బీరెల్లికి చెందిన మంకిడి పవన్​ (23) చెరువులో పడి మృతిచెందగా, అతడి కుటుంబాన్ని పరామర్శించారు, కామారానికి చెందిన అంగన్​వాడీ ఆయా అనసూర్య  ఇటీవల మృతిచెందగా, ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు.