
- 12,760 జీపీల్లో 5,359 పంచాయతీలు బీసీలకే దక్కే చాన్స్
- 42శాతం రిజర్వేషన్లతో బీసీలకు పెరగనున్న సీట్లు
- డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియపై పంచాయతీ రాజ్ అధికారులు ఫోకస్ పెట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం జీవో జారీ చేసి.. లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన ఆదేశాలతో ఇప్పటికే జిల్లాల వారీగా బీసీలకు కేటాయించాల్సిన స్థానాలు, రిజర్వేషన్లపై అధికారులు దృష్టి పెట్టారు.
రిజర్వేషన్లకు సంబంధించి కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలకు ఇప్పటికే మార్గదర్శకాలు సైతం జారీ చేశారు. పీఆర్కమిషనరేట్ నుంచి డెడికేటెడ్ కమిషన్ నివేదికను అన్ని జిల్లాల జడ్పీ సీఈవోలు ఇప్పటికే తీసుకెళ్లారు. ఈ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై లెక్కలు తీస్తున్నారు. జిల్లాల వారీగా సర్పంచ్‌లు, వార్డులు, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలు, జడ్పీ స్థానాల్లో 42 శాతం లెక్కన బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్నది ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది.
కొత్త రిజర్వేషన్లతో బీసీలకు గతంలో కన్నా 20 శాతం సీట్లు అదనంగా దక్కనున్నాయి. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా జిల్లాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్‌లు ఉండగా.. బీసీలకు 13 సీట్లు దక్కే చాన్స్ ఉంది. 565 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలుండగా.. 237 సీట్లు బీసీలకు కేటాయించనున్నారు. 5,765 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,421 సీట్లలో బీసీలకు అవకాశం లభించనున్నది. 12,760 గ్రామ పంచాయతీలకు గాను 5,359 స్థానాలు బీసీలకు దక్కనున్నాయి. ఆఫీసర్లు రిజర్వేషన్లు ఖరారు చేసినా గోప్యంగా ఉంచనున్నారు. ప్రభుత్వం 42 శాతంపై జీవో జారీ చేసిన తర్వాతే ఈ వివరాలను పీఆర్ కమిషనరేట్‌కు పంపించనున్నారు.
2019 ఎన్నికల్లో ఇలా..
2019లో రాష్ట్రంలో 12,750 జీపీలకు గాను 2,345 సీట్లు బీసీలకు కేటాయించారు. 539 జడ్పీటీసీ స్థానాల్లో 90.. 538 ఎంపీపీ స్థానాల్లో 95 బీసీలకు కేటాయించారు. ములుగు జిల్లా మంగపేట ఎంపీపీ ఎన్నిక జరగలేదు. 5,843 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,011 బీసీలకు కేటాయించారు. అప్పుడు 32 జడ్పీలు ఉండగా.. బీసీలకు 6 స్థానాలే కేటాయించారు. ప్రస్తుతం 13 జడ్పీలను కేటాయిస్తుండడం వల్ల అదనంగా 7 జడ్పీ పీఠాలు బీసీలకు దక్కనున్నాయి.
2011 సెన్సెస్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో బీసీ రిజర్వేషన్‌ను 34 నుంచి 23 శాతానికి తగ్గించింది. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కుల సర్వే చేసి ముస్లిం కులాలతో కలిపి రాష్ట్ర జనాభాలో 56.33 శాతం బీసీలున్నట్టు తేల్చింది. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వే (ఎస్ఈఈఈపీసీ) ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను మాత్రం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేయనుంది.
ఏజెన్సీ ఏరియాలో ఎస్టీలకు 50 శాతం సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుసభ్యుల సీట్లు కేటాయిస్తారు. జీపీల్లో 100 శాతం ఎస్టీ జనాభా ఉంటే సర్పంచ్, వార్డులు, ఎంపీటీసీ స్థానాలన్నీ వారికే కేటాయిస్తారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం (2018) ప్రకారం అన్ని లోకల్‌బాడీ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది.
జడ్పీల రిజర్వేషన్ ఖరారు చేసేది పీఆర్, ఆర్డీ డైరెక్టర్
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయగా మిగిలిన సీట్లను జనరల్ గా గుర్తించనున్నారు. అయితే, జడ్పీల రిజర్వేషన్లను పీఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్ ఖరారు చేయనుండగా.. జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లు కలెక్టర్లు.. ఎంపీటీసీ, సర్పంచ్ల రిజర్వేషన్లు ఆర్డీఓలు.. వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేయనున్నారు.