
- సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
మెదక్/నర్సాపూర్, వెలుగు: గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ పోయడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన మార్పు ఇదేనా ? పల్లెలపై ఉన్న పట్టింపు ఇదేనా ? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో గ్రామపంచాయతీ సిబ్బందిని కలిసి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ లేకపోవడంతో 20 రోజుల నుంచి చెత్త సేకరణ చేయడం లేదని, ట్రాక్టర్‌కు కనీసం సర్వీసింగ్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. చెత్త సేకరణ ఆగిపోవడంతో దోమలు పెరిగి మలేరియా, డయేరియా వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సఫాయి కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలే ఇవ్వడం లేదు.. కానీ ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ వస్తేనే వారికి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు.. సఫాయి కార్మికులు కమీషన్ ఇవ్వరు కాబట్టి వారికి జీతాలు ఇవ్వడం లేదా, సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చుంటే సమస్యలు తెలుస్తాయా ? అని ప్రశ్నించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఉన్నారు.