పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలె

పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలె

కనీస వేతనం అమలు చేయాలి: టీజేఎస్​ చీఫ్​ కోదండరాం 
ఉద్యమంలో పాల్గొన్న ఆఫీసర్​కు అన్యాయం చేస్తున్నరని ఫైర్ 

 

హైదరాబాద్, వెలుగు:    గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చి, రెగ్యులరైజ్ చేయాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. రెగ్యులర్ కోసం కార్మికులు ఏండ్ల నుంచి పనిచేస్తున్నారని, వారిలో 80 శాతం మంది బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారని బుధవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ కార్మికుల జీతాలు పెంచిన ప్రభుత్వం.. గ్రామ పంచా యతీ కార్మికుల జీతాలు పెంచకపోవడం సరికాదన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర స్కీమ్​లకు మళ్లిస్తున్నదని, అందుకే పంచాయతీల్లో నిధుల కొరత ఏర్పడిందని ఆయన ఆరోపించారు. వెంటనే కార్మికుల జేఏసీ నేతలను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.  


ఆ అధికారికి న్యాయం చెయ్యాలె 
రంగారెడ్డి జిల్లా నాదర్​గుల్​లోని ట్రైబల్ స్కూల్లో ఇచ్​చార్జ్ ప్రిన్సిపాల్​గా పనిచేస్తున్న మామిడి నారాయణను కర్నాటక బార్డర్ కు బదిలీ చేశారని కోదండరాం తెలిపారు. ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన పాత్ర లేకున్నా సస్పెండ్ చేశారని, అధికారులు చూపిస్తున్న కారణాలు వింతగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసిన నారాయణకు 3 ప్రమోషన్లు, 7 ఇంక్రిమెంట్లను ఆపారని తెలిపారు. రిటైర్ మెంట్ కు దగ్గర ఉన్నానని, హెల్త్ సమస్యలు ఉన్నాయని గురుకుల సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ట్రైబల్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ జోక్యం చేసుకొని ఆయనకు న్యాయం చేయాలని కోదండరాం కోరారు.