చిన్నారిపై దారుణం.. నిందితునికి ఐదు గుంజిళ్ల శిక్ష వేసిన గ్రామ పెద్దలు

చిన్నారిపై దారుణం.. నిందితునికి ఐదు గుంజిళ్ల శిక్ష వేసిన గ్రామ పెద్దలు

బీహార్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అఘాయిత్యం చేసిన ఓ కామాంధుడికి గ్రామ పెద్దలు విధించిన శిక్ష సిగ్గుతో తలదించుకునేలా చేసింది. చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితునికి పంచాయితీ సభ్యులు కేవలం ఐదు గుంజిళ్ల శిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

బీహార్ నవాడా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఐదేళ్ల చిన్నారిని చాక్లెట్ ఆశ చూపి పౌల్ట్రీ ఫాం వద్దకు తీసుకెళ్లాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు గ్రామపెద్దల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. న్యాయం చేయాలంటూ పంచాయితీ పెట్టారు. అయితే నిందితుడి తప్పేమీలేదని తేల్చిపారేసిన సదరు పెద్దలు అత్యాచారం జరగలేదని కేవలం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లినందుకుగానూ ఐదు గుంజిళ్లు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు.

గ్రామ పెద్దలు విధించిన ఐదు గుంజిళ్ల శిక్షకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ దారుణాన్ని వివరిస్తూ నెటిజన్లు బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్లను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. చివరకు ఎస్పీ గౌరవ్ మంగళ ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఐదు గుంజీళ్ల శిక్ష విధించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.