రాజస్థాన్ లో ఘోరం : గుడారాలు కూలి 14 మంది మృతి

రాజస్థాన్ లో ఘోరం : గుడారాలు కూలి 14 మంది మృతి

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. బార్మేర్ జిల్లా జసోల్ గ్రామంలోని ఓ స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదంతో ముగిసింది. టెంట్లు(పెద్ద గుడారాలు) కూలి 14 మంది  చనిపోయారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం వచ్చిన భక్తుల కోసం అక్కడ గుడారాలు ఏర్పాటు చేశారు.ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీవర్షం పడటంతో.. గుడారాలు కూలిపోయి.. కొందరు చనిపోయారు. వాటి కింద తొక్కిసలాట జరిగి మరికొందరు భక్తులు మృతి చెందారు. అదే సమయంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అవి షాక్ కొట్టడంతో మరికొందరు చనిపోయారు. గాయపడిన వారిని హాస్పిటల్ లో చేర్పించారు.ఘటనాస్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని తెలుస్తోంది.

రాణి భటియానీ దేవాలయం నిర్వాహకులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. జూన్ 30వరకు ఇది కొనసాగాల్సి ఉంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది.

మృతుల కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ.2లక్షల నష్టపరిహారం ఇవ్వనుంది.

ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.