కరోనా ప్రభావం తగ్గిందని ఎవరన్నారు?

కరోనా ప్రభావం తగ్గిందని ఎవరన్నారు?

కరోనా వైరస్ ఇంకా క్షీణించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. వైరస్ ప్రభావం తగ్గిందని పొరబడొద్దని హెచ్చరించిన సౌమ్య.. దీన్ని దృఢపరిచే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరగడానికి డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా జరగడం కారణాలన్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే ఇళ్లలో నుంచి బయటకు రావాలని సూచించారు. 

24 గంటల్లో 5 లక్షల కేసులు
‘కరోనా రక్కసి కోరలు చాస్తోంది. వైరస్ కేసులు హెచ్చుతున్నాయి. డబ్ల్యూహెచ్‌వోలోని ఆరు రీజియన్లలో ఐదింటిలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత రెండు వారాల్లో ఆఫ్రికాలో కరోనా మరణాల శాతం 30 నుంచి 40 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 5 లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే వైరస్ బారిన పడి 9,300 మంది మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి క్షీణించడం మొదలైందని ఎలా అంటాం? డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం, లాక్‌డౌన్ నిబంధనలను తొలగించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం వల్ల కరోనా మళ్లీ విజృంభిస్తోంది’ అని సౌమ్యా స్వామినాథన్ పేర్కొన్నారు.