68 బడులకు బాంబు బెదిరింపులు

68 బడులకు బాంబు బెదిరింపులు
  • బెంగళూరులో ప్రైవేట్ స్కూళ్లకు ఈ–మెయిల్స్
  • భయంతో వణికిపోయిన స్టాఫ్, స్టూడెంట్స్, పేరెంట్స్
  • అన్ని చోట్ల తనిఖీలు చేపట్టిన పోలీసులు
  • ఏమీ దొరకలేదని, ఉత్తుత్తి బెదిరింపులు కావొచ్చని వెల్లడి

బెంగళూర్ :   కర్నాటకలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం బెంగళూరులోని 68 ప్రైవేట్ స్కూళ్లకు ఓ ఈమెయిల్ వచ్చింది. ‘మీ స్టాఫ్, స్టూడెంట్లను చంపేందుకు మీ స్కూల్ లో బాంబు పెట్టినం” అని అందులో ఉంది. దీంతో ఆయా స్కూళ్ల మేనేజ్ మెంట్లు ఆందోళనకు గురయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించాయి. ‘‘స్కూల్ లో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది. మాకు బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే వచ్చి పిల్లలను తీసుకెళ్లండి” అంటూ పేరెంట్స్ కు మెసేజ్ పంపించాయి. దీంతో పిల్లల పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఆఫీసులు, ఇండ్ల నుంచి స్కూళ్లకు పరుగులు పెట్టారు. తమ పిల్లలను ఇంటికి తీసుకుని వచ్చారు. మరోవైపు ఒకేసారి ఇన్ని స్కూళ్లకు బెదిరింపులు రావడంతో బెంగళూర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగి బాంబ్ స్క్వాడ్ తో అన్ని స్కూళ్లకు వెళ్లారు. విద్యార్థులు, టీచర్లు అందరినీ బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. స్కూళ్లలో అణువణువూ పరిశీలించారు. అయితే ఏ స్కూల్ లోనూ ఏమీ దొరకలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవన్నీ ఫేక్ ఈమెయిల్స్ అయి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఇంతకుముందు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయన్నారు. కాగా, కాంగ్రెస్ సర్కార్ పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఫైర్ అయ్యాయి.

తేలిగ్గా తీసుకోం: హోంమంత్రి

మొత్తం 68 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చిందని బెంగళూర్ సిటీ పోలీస్ కమిషనర్ బి.దయానంద తెలిపారు. వీటిలో 48 సిటీ లిమిట్స్ లో ఉండగా, మిగతావి సిటీ శివార్లలో ఉన్నాయని చెప్పారు. ‘‘మాకు సమాచారం అందిన వెంటనే అన్ని స్కూళ్లకు బాంబ్ స్క్వాడ్స్ ను పంపించాం. స్టూడెంట్లు, స్టాఫ్ ను స్కూళ్ల నుంచి బయటకు పంపించి తనిఖీలు చేపట్టాం. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. బహుశా ఇవన్నీ ఫేక్ ఈమెయిల్స్ అయి ఉండొచ్చు. ఇంతకుముందు కూడా ఇలా బెదిరింపు ఈమెయిల్స్, లెటర్లు స్కూళ్లకు వచ్చాయి. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. ఈరోజు వచ్చిన ఈమెయిల్స్ ను పరిశీలిస్తున్నాం. దీనిపై విచారణ జరుపుతున్నాం” అని పేర్కొన్నారు. అసలు ఆ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అనే దానిపై సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని హోంమంత్రి జి.పరమేశ్వర తెలిపారు. ‘‘kharijites@beeble.com అనే ఐడీ నుంచి స్కూళ్లకు ఈమెయిల్ వచ్చింది. ఇది టెర్రర్ ఆర్గనైజేషన్ల పనా? లేక మరెవరైనా చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నాం. గతంలోనూ ఇట్లనే బెదిరింపులు వచ్చాయి. ఇది కూడా ఫేక్ కావొచ్చు. అలా అని మేం దీన్ని తేలిగ్గా తీసుకోం” అని చెప్పారు.

24 గంటల్లో పట్టుకుంటాం: డిప్యూటీ సీఎం శివకుమార్

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి దగ్గర్లోని స్కూల్ కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఆయన వెంటనే ఆ స్కూల్ కు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రాథమిక ఆధారాలను బట్టి ఈమెయిల్స్ అన్ని ఫేక్ కావొచ్చని తెలుస్తున్నది. అయినప్పటికీ మేం అలర్ట్ గా ఉన్నాం. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. ఇది అల్లరి మూకల పని అయి ఉండొచ్చు. నిందితులను 24 గంటల్లో పట్టుకుంటం. సైబర్ క్రైమ్ పోలీసులు అదే పనిలో ఉన్నారు” అని చెప్పారు.