నిమ్స్​ ఆరోగ్యశ్రీ రూమ్​లో పటాకులు నిజమే!

నిమ్స్​ ఆరోగ్యశ్రీ రూమ్​లో పటాకులు నిజమే!
  • వీడియో తీసింది తానేనన్న వైద్యాధికారి 
  • డైరెక్టర్​కు, పోలీసులకు వాంగ్మూలం
  • సోషల్​మీడియాలో వైరల్​చేసిందీ అతడేనా? 
  • ఘటన జరిగిన రోజే ఎందుకు చెప్పలేదనే ప్రశ్నలు  
  • ఆధిపత్య పోరే కారణమని అనుమానాలు?

పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ దవాఖానలోని ఆరోగ్య శ్రీ రూమ్​లో పటాకులు ఉన్నాయంటూ నాలుగు రోజుల కింద ఓ వీడియో సోషల్​మీడియాలో వైరల్​కాగా, అలా ఉన్నట్టు తమకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని పంజాగుట్ట పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే..అయితే, అగ్ని ప్రమాదం జరిగిన రోజు పక్కనే ఉన్న ఆరోగ్యశ్రీ గదిలో పటాకులు నిల్వ చేశారన్నది నిజమేనని, తాను వీడియో తీశానంటూ హాస్పిటల్​కు చెందిన ఓ వైద్యాధికారి డైరెక్టర్​తో పాటు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఘటన జరిగిన రోజే పోలీసులకు గానీ, నిమ్స్​ఉన్నతాధికారులకు చెప్పకపోవడం, ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత బయటపెట్టడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. 

వీడియో తీసిన వ్యక్తే మీడియాకు లీకులు ఇచ్చి గ్రూపుల్లో వైరల్ అవడానికి కారణమయ్యాడని అంతా అనుకుంటున్నారు. దీనికి నిమ్స్​లోని ఆధిపత్య పోరే కారణమని భావిస్తున్నారు. కాగా, వీడియో విషయమై శాఖాపరంగా ఇంటర్నల్​ఎంక్వైరీ చేయిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు కూడా ఆరోగ్యశ్రీ విభాగం సిబ్బందిని విచారిస్తున్నట్టు సమాచారం. పోలీసులు మాత్రం దీనిపై నోరు విప్పడంలేదు.
 
షార్ట్​సర్క్యూట్​కారణం కాదా? 

ఈ నెల19న నిమ్స్ హాస్పిటల్​ఎమర్జెన్సీ బిల్డింగులోని ఐదో అంతస్తులోని ట్రామా బ్లాక్ లో అగ్ని  ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు కమ్మడంతో పేషెంట్లు, డాక్టర్లు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ ప్రమాదం షార్ట్​సర్క్యూట్​వల్లే జరిగిందని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు కొత్త వాదన ఒకటి తెరపైకి వస్తోంది. అక్కడ కొద్ది రోజుల కింద కార్పెంటర్​పని నడిచిందని, దీంతో అక్కడ చెత్త, చెక్క పొట్టు పేరుకుపోయిందని, ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి ఎవరో బీడీ, సిగరెట్ కాల్చి పడేయడం వల్లే ఫైర్​యాక్సిడెంట్​జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.