కేజ్రీవాల్ పార్టీకి 16 మిలియన్ డాలర్ల ఖలిస్తాన్ నిధులు.. పన్నూ సంచలన ఆరోపణలు

కేజ్రీవాల్ పార్టీకి 16 మిలియన్ డాలర్ల ఖలిస్తాన్ నిధులు.. పన్నూ సంచలన ఆరోపణలు

లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యి.. ఈడీ కస్టడీలో ఉన్న ఆప్ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు ఖలిస్తాన్ ఉగ్రవాది.. సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ.  ఆన్ లైన్ ద్వారా వీడియో చేసిన పన్నూ.. కేజ్రీవాల్ నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రో ఖలిస్తాన్ గ్రూపులు నుంచి 16 మిలియన్ డాలర్ల నిధులు వచ్చినట్లు వెల్లడించారాయన. ప్రో ఖలిస్తాన్ సంస్థల నుంచి.. 2014 నుంచి 2022 సంవత్సరాల మధ్య కాలంలో.. ఆప్ పార్టీ ఈ నిధులు తీసుకున్నట్లు సంచలన వివరాలు వెల్లడించారు పన్నూ. ఖలిస్తాన్ గ్రూపుల నుంచి వచ్చిన డబ్బులకు ప్రతిఫలంగా.. జైలులో ఉన్న ఖలిస్తాన్ లీడర్ భుల్లర్ ను విడుదల చేయటానికి కేజ్రీవాల్ అంగీకరించాడనే విషయాన్ని సైతం ఆయన చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది. 

కేవలం నిధుల విషయమే కాకుండా.. 2014లో అమెరికాలోని న్యూయార్క్ లో ఖలిస్తాన్ అనుకూల సంస్థలతో కేజ్రీవాల్ సమావేశం అయినట్లు కూడా వీడియో ద్వారా వెల్లడించారు పన్నూ. గురుద్వారా రిచ్ మండ్ హిల్స్ లో ఈ భేటీ జరిగిందని.. ప్రో ఖలిస్తాన్ గ్రూపులు.. ఆప్ పార్టీకి నిధులు ఇచ్చినట్లయితే.. భుల్లర్ ను విడుదల చేస్తామని ఆ సమావేశంలో హామీ ఇచ్చినట్లు సిక్ ఫర్ జస్టిస్ రుగుపత్వంత్ సింగ్ పన్నూ స్పష్టం చేశారు. 

ఇంతకీ భుల్లర్ ఎవరు అంటారా.. అతను ఖలిస్తాన్ ఉగ్రవాది. 1993 ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు. మరణ శిక్ష పడిన ఖైదీ. ఆ తర్వాత మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. 20 ఏళ్లుగా జైలులో ఉన్నాడు భుల్లర్. ఇతన్ని విడుదల చేయటానికే సీఎం కేజ్రీవాల్ హామీ ఇచ్చినట్లు.. పన్నూ చెబుతున్నాడు. 

సిఖ్ ఫర్ జస్టిస్ చీఫ్ పన్నూ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఖనిస్తాన్ ఉగ్రవాదిగా విదేశాల్లో ఉంటున్న పన్నూ.. ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆప్ పార్టీకి ఖనిస్తాన్ ఉగ్ర సంస్థల నుంచి 16 మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయనటం.. ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండటంతో.. దీనిపై ఆప్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి..