న్యూఢిల్లీ: ఐపీఎల్–19లో ఘోరంగా నిరాశపర్చిన లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్సీ నుంచి రిషబ్ పంత్ తప్పుకున్నాడు. ఈమేరకు రిషబ్ చేసిన అభ్యర్థనను అంగీకరించామని ఫ్రాంచైజీ శుక్రవారం వెల్లడించింది. ఈ సీజన్‌లో లక్నో ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలోనే నెగ్గింది. దాంతో ఆఖరి ప్లేస్‌తో సరిపెట్టుకుంది. ఇక బ్యాటర్‌గానూ రిషబ్ ఘోరంగా ఫెయిలయ్యాడు. ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 312 రన్స్ మాత్రమే చేశాడు.
‘కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని రిషబ్ స్వయంగా కోరాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవించాం. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. కెప్టెన్‌గా పంత్ అందించిన సేవలకు మేం కృతజ్ఞతలు చెబుతున్నాం. జట్టును కొత్తగా నిర్మించడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాం’ అని ఫ్రాంచైజీ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ పేర్కొన్నాడు. 2025 మెగా వేలంలో పంత్‌ను ఏకంగా రూ. 27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.
