
అసూన్సియోన్ (పరాగ్వే) : స్వామి నిత్యానంద అధినేతగా ఉన్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ దేశంతో పలు రంగాల్లో ఒప్పందాలు చేసుకున్న పరాగ్వే దేశపు అగ్రికల్చర్ మినిస్టర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫీసర్ పదవి ఊడింది. అసలు ఆ దేశం ఎక్కడుందో కూడా తెలియదని, మౌలిక సదుపాయాలు, నీటి పారుదల రంగాలకు సాయం చేస్తామంటే ఎలా సంతకాలు చేశారని సదరు ఆఫీసర్ పై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. ఐదారు నెలల క్రితం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమావేశాలకు పరాగ్వే అగ్రికల్చర్ మినిస్ట్రీ చీఫ్ ఆఫీసర్ అర్నాల్డో చమర్రో కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా అతడిని కైలాస ప్రతినిధులు కలిశారు.
పరాగ్వేలో మౌలిక సదుపాయాలు, నీటి పారుదల రంగాల్లో సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో అర్నాల్డో కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేశారు. సమావేశాల తర్వాత కైలాసతో ఒప్పందాలపై పరాగ్వేలో అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇదో పెద్ద స్కామ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో పరాగ్వే సర్కారు అర్నాల్డోపై విచారణ చేపట్టింది. తాజాగా పదవి నుంచి తప్పించింది. అతను కైలాసతో చేసుకున్న ఒప్పందాలు చెల్లవని, వాటితో పరాగ్వే సర్కారుకు ఏ సంబంధమూ లేదని ప్రకటించింది. అమెరికా, కెనడా ప్రతినిధులతోనూ కైలాస ప్రతినిధులు ఇదే విధంగా ఒప్పందాలు చేసుకోవడం విశేషం.